‘జగన్’న్నాథ రథచక్రాల కిందపడి నలిగిపోయిన మందుబాబులు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం మద్యం దుకాణాలను తెరుచుకోవచ్చని అనుమతులు ఇచ్చింది.  దీంతో అన్ని రాష్ట్రాలతో పాటు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించి తీరుతాం అంటూ సవాల్ చేసిన వైఎస్ జగన్ ఏపీలో మద్యం విక్రయాలకు పచ్చ జెండా ఊపారు.  అది కూడా 25 శాతం రేట్లను పెంచుతూ విక్రయాలు స్టార్ట్ చేశారు.  సుమారు 40 రోజుల తర్వాత మందు అమ్మకానికి పెట్టడంతో మందుబాబులే కాదు అరకొరగా తాగే వారు కూడా ఎగబడి బ్రాండ్ ఏదైనా సరే మందు కొనుగోలు చేశారు.  ఈ అమ్మకాల ద్వారా మే 4 తొలిరోజున రూ.70 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.  ఈ మొత్తంలో ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం అందింది.  లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా ఈ స్థాయి అమ్మకాలంటే రికార్డ్ అనే అనాలి. 
 
ఆ తర్వాత వైఎస్ జగన్ ఇంకో 50 శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో మందుబాబులు ఇంత భారీగా ధరలు పెంచడం అంటే మమ్మల్ని దోచుకోవడమేనని, మందుకు అలవాటుపడిన తమ బలహీనతను ఇలా క్యాష్ చేసుకుంటారా అంటూ తిడుతూనే లిక్కర్ షాపుల ముందు క్యూలు కట్టారు.  ఇక వారి కుటుంబ సభ్యులైతే నిషేదం చేస్తానని ఈ లాక్ డౌన్ సమయంలో షాపులు తెరవడం ఏమిటి, 75 శాతం ధరలు పెంచడం ఏమిటి.  ఈ చర్యతో దాచుకున్న డబ్బు, సర్కార్ నుండి అందిన 1000, 500ల ఆర్థిక సహాయం అన్నీ మద్యం కోసమే ఖర్చువడంతో మరింత కుంగిపోయామని వాపోతున్నారు. 
 
మరోవైపు సర్కార్ మాత్రం 75 శాతం ధరలు పెంచి, 13 శాతం షాపులను తొలగించడం వలన విక్రయాలు తగ్గాయని అంటూ తాజా విక్రయాలను మే 4వ తేదీ విక్రయాలతో, గతేడాది లెక్కలతో పోల్చి చూపుతున్నారు. అసలు లాక్ డౌన్ రోజులకు సాధారణ రోజులకు అమ్మకాల్లో పోలిక సరైనది కానేకాదు.  ఈ తేడాను చూపి మద్య నిషేధంలో గొప్ప ఫలితాల్ని సాధించామనడం సమంజసం అనిపించుకోదు.  ఇక రోజువారీ విక్రయాలు తగ్గడానికి మందుబాబుల జేబులు ఖాళీ అవడం, షాపుల్లో నిల్వలు నిండుకోవడం ప్రధాన కారణాలు.  అంతేకానీ సర్కార్ చర్యలతో మందుబాబుల్లో ఎలాంటి మార్పూ రాలేదు సరికదా ఆర్థికంగా మరింత చితికిపోయారు కూడ.