సంక్షేమ పథాకాల పేరుతో ప్రజల ఖాతాల్లోకి డబ్బు మళ్లిస్తూ వాటి మీదే భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు వైఎస్ జగన్. గడిచిన ఏడాది పాలనలో ఆయన ఏం చేశారు అంటే రూ.43 వేల కోట్లను నవరత్నాల ద్వారా ప్రజలకు పంచి పెట్టారు. ప్రతిపక్షం ఈ విషయాన్ని విమర్శకు వాడుతుంటే ముఖ్యమంత్రితో సహా అధికార పార్టీ లీడర్లంతా ప్రచారం కోసం, జనం మెప్పు పొందడం కోసం గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ పథకాల ద్వారా అన్ని సామాజిక వర్గాలను దగ్గరకు చేసుకోవాలనేది వైసీపీ అంతిమ లక్ష్యం. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలతో పాటు మరొక ప్రధాన సామాజిక వర్గం కాపులు కూడా జగన్ వైపు మొగ్గుచూపారు.
Read more : కరోనా కోసం కొత్తరకం మాస్క్ !
ఓటు బ్యాంకు పరంగా కాపు సామాజిక వర్గం చాలా కీలమైనది. మొత్తం ఓటర్లలో వారు 20 శాతం వరకు ఉన్నారు. అందుకే ఈ ఓటు బ్యాంకుపై లీడర్లు ఎక్కువ దృష్టి సారిస్తుంటారు. ప్రతి ఎన్నికల్లో కాపులంతా ఒకే ఛాయిస్ ఎంచుకుంటూ ఉంటారు. 2014లో చూస్తే ఎక్కువమంది టీడీపీకి ఓట్లు వేశారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పొటీలోకి దిగడంతో వారు కూడా చీలిపోయారు. ఉన్నవారిలో 30 నుండి 40 శాతం మంది జనసేనకు ఓట్లు వేస్తే మరో 30 నుండి 40 శాతం మంది వైసీపీకి వేశారు. టీడీపీకి మాత్రం చాలా తక్కువ మంది వేశారు.
గత ఎన్నికల సమయంలో చంద్రబాబు పాలన పట్ల వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఆ సమయంలో పవన్ గనుక పోటీలో లేకపోతే 80 శాతం ఓట్లు వైసీపీకే వెళ్లేవి. కానీ పవన్ ఒకటికి మించి సీట్లు సాధించలేకపోయినా కాపు ఓటు బ్యాంకులో దాదాపు సగం వరకు కైవసం చేసుకోగలిగారు. అదే వైసీపీలో కంగారు కలిగిస్తోంది. సంక్షేమం విషయంలో వారికి ఏమాత్రం లోటు కనిపించినా నెక్స్ట్ టైమ్ పూర్తిగా జనసేన వైపుకు టర్న్ తీసుకుంటారు. అప్పుడు అధికారం దక్కినా గత ఎన్నికల్లో సాధించిన స్థాయి విజయం దక్కదు. పవన్ పుంజుకునే అవకాశం కూడా ఉంది.
Read More : Why KCR not acting like Jagan and Modi?
అందుకే జగన్ వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో చెప్పినట్టు హామీలను అమలుచేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు కాపుల సంక్షేమ కోసం ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. తాజాగా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి యేడాదికి రూ.15 వేల చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లించనున్నారు.
ఇందులో మొదటి విడతగా ఈరోజు పలు నిబంధనల కింద 2.35 లక్షల మందిని ఎంపిక చేసి రూ.354 కోట్లు ప్రత్యక్షంగా బదిలీ చేశారు. ఈ రకమైన నగదు బదిలీ పథకాలు సామాజిక వర్గాలను ఆకర్షించడానికి బాగానే పనిచేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది పవన్ మీద జగన్ సంధించిన అస్త్రమే అనుకోవాలి. గత ఎన్నికల్లో పవన్ వైపు మొగ్గుచూపిన 30 నుండి 40 శాతం వచ్చే ఎన్నికల్లో పెరగడకుండా ఉండేందుకు, క్రితంసారి తమను ఆదరించిన వారి శాతం తగ్గకుండా ఉండేందుకు ఈ రకమైన నగదు బదిలీ పథకాలనే జగన్ గట్టిగా నమ్ముకున్నారు. మరి కాపులు జగన్ పతాకాలకు ప్రభావితమవుతారో లేదో చూడాలి.