ఇదిగో ఈ మొండితనమే వైఎస్ జ‌గ‌న్‌ను నిలబెడుతోంది !

లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది.  ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే.  ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోవడంతో ఖజానా ఖాళీ అవుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వెయట్లేదు.  ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కో హామీని నిలబెట్టుకుంటున్నారు.  పాలనాపరమైన వ్యయాన్నే పూర్తి స్థాయిలో తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడానికి వెనుకాడని జగన్ సర్కార్ కష్టాల పేరుతో సంక్షేమ పథాకలకు స్వస్తి చెప్పలేదు. 
 
ఈ లాక్ డౌన్ కాలంలోనే వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతు ఖాతాలోకి రూ.5,500 నగదును బదిలీ చేశారు.  సుమారు 49.43 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు.  నవరత్నాల్లో ముఖ్యమైన ఈ పథకాన్ని దశల వారీగా అమలుచేస్తారు.  తొలివిడతగా 15న రూ.2800 కోట్లు ఖర్చు చేసింది.  అర్థిక భారల్లో ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీ అంటే భారమే.  కానీ వైఎస్ జగన్ మాత్రం జంకలేదు.  ఆరు నూరైనా చెప్పింది చేసి తీరాలనే ఉద్దేశ్యంతో మొండిగానే ముందడుగు వేశారు. 
 
ఈ ఒక్క పథకం అమలుతోనే ఆయన ఆగిపోలేదు.  మేనిఫెస్టోలోని మరొక కీలక పథకం వాహన మిత్రను కూడా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.  ఈ పధకం ద్వారా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఓనర్ కమ్ డ్రైవర్లు, ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు ఇలా 2,36,344 మందికి ఒక్కొక్కరికి రూ. 10,000 ఇవ్వనున్నారు.  జూన్ 4న లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది.  గతేడాది కూడా 
ఇదే సాయాన్ని అందుకున్న డ్రైవర్లు కష్టాల్లో ఉన్న తమను జగన్ ఆదుకున్నారని అంటున్నారు.  
 
అంతేకాదు సంక్షేమ పథకాల అమలు కోసం ఏకంగా ఒక క్యాలెండర్ రూపొందించిన వైకాపా సర్కార్ వాటి ప్రకారం క్రమం తప్పకుండా పథకాలను అమలు చేస్తామని అంటోంది.  సాధారణంగా వేరే రాష్ట్రాలైతే కష్టాల్లో పథకాల కోసం వేల కోట్లు ఎక్కడి నుండి తేవాలి అంటూ మొండికేసేవి.  అసలు పథకాలే రద్దు చేసుకునేవి.  కానీ జగన్ మాత్రం భయపడలేదు.  ఖజానా ఖాళీగా ఉన్నా, భవిష్యత్తులో ఆదాయ మార్గాలు కనిపించపోయినా పథకాలను నిలపాలనే ఆలోచనను మాత్రం ప్రస్తావనకు కూడా రానివ్వట్లేదు. 
 
అవసరమైతే ప్రభుత్వ ఆస్తులు అమ్మి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం అంటున్నారు.  అందుకోసం భూముల్ని కూడా సేకరించారు.  ఆస్తుల అమ్మకం అనేద విపరీతమైన చర్యే అయినా పథకాల అమలు కోసం జగన్ ఈ ప్రయత్నం కూడా చేయడం జనానికి నచ్చింది.  ఈ పద్దతితో జగన్ ఎన్ని కష్టాలు వచ్చినా సంక్షేమం మరువడు అనే పేరు తెచ్చుకున్నారు.