ఆంధ్ర ప్రదేశ్ టిబెట్ కాదు, బాబు ద లైలామా కాదు 

Chandra Babu Naidu
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం టిబెట్ కాదు. అలాగే టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు ద లైలామా కాదు. ఇది ముందుగా టీడీపీ నాయకులూ, అభిమానులూ తెలుసుకోవాల్సిన, అంగీకరించవలసిన విషయం. 
 
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న (శనివారం) చంద్రబాబు నాయుడు కొందరు ఎన్నారైలతో, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో వచ్చిన అభిప్రాయాలూ, చంద్రబాబు నాయుడు మాటలు విన్న తర్వాత టీడీపీ నేతలు ఒక భిన్నమైన ఆలోచనలో ఉన్న విషయం తెలుస్తోంది. మొదటిగా టీడీపీ నేతలు, అభిమానులు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ పార్టీని సమర్ధించే సామాజిక వర్గం ప్రజలు ఈ అభిప్రాయంలో ఉన్నారు. 
 
రాష్ట్రంలో తెలుగుదేశం ఓటమిని, చందరబాబు నాయుడు ఓటమిని అంగీకరించడం లేదు. గతంలో అంటే 2004లో తిరిగి 2009లో టీడీపీ ఓడిపోయినప్పుడు పార్టీ నాయకులు ఓటమిని అంగీకరించి అందుకు కారణాలు వెతికారు. కానీ 2019లో ఓటమిని అంగీకరించడం లేదు.  మొదట 2004లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు తన విధానాలు మార్చుకోవాలని, పార్టీ నాయకులూ, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని విశ్లేషణలు చేసుకున్నారు. చంద్రబాబు 1995 నుండి 2004 వరకు ఒక సీఈఓ లా ప్రవర్తించారని, అధికారులకు సర్వాధికారాలు అప్పగించి పార్టీ కార్యకర్తలు, నాయకులను విస్మరించారని అందువల్లే ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని విశ్లేషణలో తేల్చేశారు. “మీరు మారాలి”  అంటూ చంద్రబాబు పై వత్తిడి తెచ్చారు. చంద్రబాబు కూడా అంగీకరించి ఆమేరకు తన విధానంలో మార్పులు తెచ్చుకున్నారు. 
 
ఆ తర్వాత 2009లో మరోసారి పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీ ఓటమిని అంగీకరించి పార్టీ విధానాల్లో మార్పు రావాలని, పార్టీ హై టెక్ విధానాలతో పాటు వ్యవసాయరంగంపై ద్రుష్టి పెట్టాలని కోరుకున్నారు. రైతులను, వ్యవసాయ రంగాన్ని వదిలేయడం వల్లనే పార్టీ ఓటమి పాలయిందని విశ్లేషణలో తేల్చారు. ఆమేరకు పార్టీ విధానాలు మార్చుకుని రైతు రుణమాఫీ ప్రధాన వాగ్దానంగా 2014 ఎన్నికల్లో గెలిచారు. రాష్ట్ర విభజనతో పార్టీ 2009 తర్వాత జరిగిన విశ్లేషణల ఫలితంగా 2014లో పార్టీ సిద్ధాంతాల్లో, విధానాల్లో మార్పులు తెచ్చి తిరిగి గెలిచారు. 
 
కానీ 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పొందినా ఆ పార్టీ నేతలు, చంద్రబాబుతో సహా ఎవ్వరు ఇప్పటికి ఓటమిని అంగీకరించడం లేదు. “మీరెలా ఓడిపోతారు” అంటూ ప్రజలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. అలాగే “మనం ఓడిపోవడం ఏంటి” అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా “వైసీపీ గెలవడం ఏంటి”, “జగన్ ముఖ్యమంత్రి ఏంటి”, “జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడు”, అంటూ ప్రశ్నలు మొదలు పెడుతున్నారు. అంటే 2004లో కానీ 2009లో కానీ ఓటమి తర్వాత జరిగిన విశ్లేషణ ఇప్పుడు లోపించిందని చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో ఓటమిని, అందునా జగన్ పై ఓటమిని అంగీకరించేందుకు పార్టీ నాయకులూ, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాజిక వర్గ ప్రజలు సిద్ధంగా లేరు. 
 
హైదరాబాద్ లో ఉన్నప్పుడు జరిగిన విశ్లేషణలు అమరావతిలో జరగలేదు. హైదరాబాద్ కు అమరావతికి తేడా ఏంటంటే అమరావతి, ఆంధ్ర ప్రదేశ్ తమవే అనే అభిప్రాయం కలగడం, అలాంటి అభిప్రాయంతో తమ ఓటమిని అంగీకరించకపోవడం, ఇతరుల గెలుపును జీర్ణించుకోలేకపోవడం జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి, సమాజానికి మంచిది కాదు. బహుశా బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ తో పాటు కూకట్ పల్లిని కబ్జా చేసినట్టు తాము ఆంధ్ర ప్రదేశ్ ను, అమరావతిని కబ్జా చేశామనే భావనకు వాళ్ళు వచ్చేశారు. అందుకే వారి అప్రోచ్ లో ఇంత మార్పు కనిపిస్తోంది. 
 
ఇక శనివారం నాటి వీడియో కాన్ఫరెన్స్ చూస్తే చంద్రబాబు కానీ, కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారి అభిప్రాయాలూ చూస్తే అమరావతితో కూడిన ఆంధ్ర ప్రదేశ్ తమది అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిరోధంలో పూర్తిగా విఫలం అయిందని చెపుతూనే చంద్రబాబు నాయుడు ఒక షాడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ, అధికారులతో పనులు చేయించాలని ఒక బాధ్యతగల నేతగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడిపించాలని కొందరు కోరారు. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని వీరు అంగీకరించడం లేదు. ఈ ముఖ్యమంత్రిని అంగీకరించడం లేదు. ఈ రాష్ట్రం తమ జాగీరు అనే బలమైన అభిప్రాయంతో ఉన్నారని స్పష్టం అవుతోంది. 
 
ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఇతర దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు, ప్రత్యేకించి ఆ సామాజిక వర్గం ప్రజలు టీడీపీ ఓటమిని, చంద్రబాబు ఓటమిని అంగీకరించడం లేదు. ఈ ప్రభుత్వాన్ని అంగీకరించడం లేదు. అలాగే చంద్రబాబు అధికారంలో లేని ఆంధ్ర ప్రదేశ్ ను వారు గుర్తించడం లేదు. అందుకే ప్రత్యామ్నాయ ప్రభుత్వం, షాడో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచనలు వచ్చాయి. 
 
టిబెట్ ను చైనా ఆక్రమించిన తర్వాత టిబెట్ పౌరులు చైనాను గుర్తించక తమ ఆధ్యాత్మిక గురువు ద లైలామా నేతృత్వంలో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా నడుపుతున్నారు. ఇప్పుడు టీడీపీ కానీ ఆ సామాజిక వర్గం కానీ సరిగ్గా ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. చంద్రబాబు లేని రాష్ట్రం తమది కాదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేని ప్రభుత్వం తమది కాదని ఒక బలమైన అభిప్రాయంతో ఉన్నారు. 
 
ఇలాంటి ఆలోచనలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణం అయ్యాయి. వారిలో ఉండే ఇలాంటి ఆలోచనలే 2019లో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని కులాలను ఏకం చేసి టీడీపీని ఓడించాయి. అయినా దురదృష్టవశాత్తు ఆ సామాజిక వర్గం ఇలాంటి ఆలోచనలు మానుకోలేదు. ఈ ధోరణి ఆ పార్టీని, ఆ నాయకులను, ఆ సామాజిక వర్గాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.