అయాచితంగా వచ్చిన పదవి కాదు 

కొంతమంది అలవోకగా గొప్పోళ్ళు అయిపోతారు. పదవులు వీరి ఇంటిచుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొందమందికి పదవులు పరిస్థితుల ప్రభావం వల్లనో లేక లాబీయింగ్ వల్లనో వస్తుంటాయి. ఇంకొంతమందికి మాత్రమే పోరాడితేనే పదవులు వస్తాయి. ఇలాంటి వారు ఆ పదవుల్లో ఉండడానికి నిరంతరం పోరాటం చేస్తూనే, నిరంతరం ప్రజల అభిమానం నిలుపుకునేందుకు పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ కోవకు చెందిన నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మే 30, 2020 నాటికి ఒక యేడాది పూర్తిచేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, ఆయన రాజకీయాలు, పరిపాలనపై ఒక సమీక్ష అవసరమే. ప్రజలు 2019 ఎన్నికల్లో ఆయనకు ఇచ్చిన ఘనవిజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు సద్వినియోగ చేసుకుంటున్నారో, తనకు లభించిన ప్రజాదరణను ఈమేరకు కాపాడుకుంటున్నారో ఒక్కసారి సమీక్షించుకోవాల్సిందే. 
 
ముందు చెప్పినట్టు పదవులు జగన్మోహన్ రెడ్డికి అయాచితంగా రాలేదు. పదవులకోసం ఆయన తీవ్రమైన పోరాటం చేయవలసి వచ్చింది. శత్రువులు బలమైన వారు. అధికారంలో ఉన్నవారు లేదా అధికారం రుచిచూసిన వారు. కొన్ని వ్యవస్థల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా. ఇలాంటి వారిని ఎదుర్కొని నిలబడి పదవి సాధించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో 16 నెలలు జైల్లో ఉండవలసి వచ్చినా, తాను జైల్లో ఉన్నసమయంలో తన కుటుంబం మొత్తం రోడ్డుమీద పడినా చలించకుండా పట్టుదలతో పదవి సాధించిన వ్యక్తి. 
 
తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డాడని అందరూ, ప్రత్యేకించి ప్రత్యర్ధులు అంటూ ఉంటారు కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదని తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటం, ఎదుర్కున్న కష్టాలు చూసినవారు తేలిగ్గానే అర్ధం చేసుకోగలుగుతారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిలోని ఈ పట్టుదల గురించి కాస్త ముందుగానే ఉహించి, ఒక అంచనా వేసిన రాజశేఖర్ రెడ్డి ప్రత్యర్ధులు ఆదిలోనే జగన్ ను తొక్కేయాలని చాలా పధకం ప్రకారం ఆయనపై తీవ్రస్థాయి ప్రచారం మొదలు పెట్టారు. మీడియా కూడా ఈ ప్రచారానికి గట్టి ఊతం ఇచ్చింది. 
 
ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిని ఒక హింసాత్మక ప్రవ్రుత్తి కలిగిన వ్యక్తిగా, అవినీతి పరుడిగా, పదవీకాంక్ష ఉన్న వ్యక్తిగా ప్రత్యర్ధులు ముద్ర వేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలకు పరిచయం చేసిన ప్రత్యర్ధులు, మీడియా రాయలసీమ నేపథ్యంలో చూపించే  తెలుగు సినిమాల్లో విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారమే 2014లో అతి తక్కువ తేడాతో అధికారం కోల్పోయారు జగన్. ఆ ఎన్నికల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పై ప్రచారం మరింత విస్తృతంగా సాగింది. 
 
జగన్ గెలిస్తే అమరావతి రాజధానిగా ఉండదని, రాష్ట్రంలో పులివెందుల రౌడీలు దౌర్జ్యన్యాలకు దిగుతారని, రాష్ట్రాన్ని అమ్మివేస్తారని విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. విదేశాల్లో డాలర్లు సంపాదించుకుంటున్న కొందరు ఎన్నారైలు కూడా రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ పార్టీకి ఇవ్వని ఆధిక్యం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. 
 
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా చేతికి అందిన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోడానికి జగన్మోహన్ రెడ్డి నిరంతరం పోరాటం చేయాల్సి వస్తోంది. శత్రువులు బలమైన వారు. అన్ని వ్యవస్థలపై పట్టు ఉన్న వారు. డబ్బు, పలుకుబడి ఉన్నవారు. తిమ్మిని బమ్మిని చేయగల ఘటనాఘట సమర్థులు. వ్యవస్థలను వాడుకోవడంలో సమర్థులు. ఇలాంటి ప్రత్యర్థుల కుట్రల  నుండి తనను తాను రక్షించుకునే క్రమంలో యేడాది పాటు పోరాటం చేస్తూనే ఉన్నారు. 
 
అడుగడుగునా అడ్డుపడే ప్రత్యర్థులను ఒంటి చేత్తో ఎదుర్కొంటూనే ప్రజలకు తానిచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం శ్రమించిన జగన్మోహన్ రెడ్డి మొదటి యేడాది విజయం సాధించారనే చెప్పుకోవాలి. ఆర్ధిక లోటు, అప్పుల భారం వెంటాడుతున్నా, ఆర్ధిక వనరులు లేకపోయినా ఈ యేడాదిలో తానిచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన ఘనత సాధించారు జగన్మోహన్ రెడ్డి. 
 
కరోనా ప్రపంచాన్ని అతలా కుతలం చేసినా మొక్కవోని దీక్షతో ముందుచూపుతో రాష్ట్రాన్ని కాపాడిన ఘనత ఆయనదే. శత్రువులు ఆయన చర్యలను, వ్యాఖ్యలను ఎంత తప్పుపట్టినా, ఎంత అపహాస్యం చేసినా ఇప్పుడు అన్ని దేశాల నేతలూ, కరొనపై పరిశోధనలు చేస్తున్న సంస్థలు జగన్ చెప్పిన విషయాన్నే సమర్ధించాల్సి వస్తోంది. అయినా “నేను ముందే చెప్పాను” అని గాని “ఆ విషయం చెప్పింది నేనే” అని గాని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం లేదు. 
 
ఇక ఈ యేడాదిలో ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సులు లేవు. విదేశీ పర్యటనలు లేవు. స్టార్ హోటల్ సమావేశాలు లేవు. ప్రకృతిని శాసిస్తున్నాం అనే ప్రగల్భాలు లేవు. గంటలకొద్దీ సమీక్షలు లేవు. భారీ ప్రకటనలు లేవు. నవనిర్మాణ దీక్షలు లేవు. ధర్మ పోరాట దీక్షలు లేవు. ఖజానాను ఖాళీ చేసే ఏ ఆర్భాటమూ లేదు. పాలన సవ్యంగా సాగుతోంది. ఎవరి పని వారు చేస్తున్నారు. ప్రజలకు అవసరాలు తీరుతున్నాయి. ఇంతకంటే ఒక పాలకుడు నుండి కోరుకునేది ఏముంటుంది! ప్రజలు మెచ్చే పాలన సాగుతోంది. ప్రత్యర్థుల ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టే పరిస్థితి వస్తోంది.