ఏకు మేకై కూర్చున్న రఘురామ కృష్ణ రాజు!

నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణ రాజు వివాదం ఇంతగా సాగ లాగేందుకు వైకాపా అధిష్టానం వర్గం అవకాశం ఇచ్చి వుండ కూడదు. రాష్ట్ర స్థాయిలో మొగ్గులోనే తుంచి వేసి వుంటే  యంపి డిఫెన్స్ లో పడిపోయే వారు. సమస్య జాతీయ స్థాయికి వెళ్లేది కాదు. అధికారంలోని కొచ్చిన ఒక సంవత్సరంలోనే ఒక పార్లమెంటు సభ్యుణ్ణి సాగనంపితే మరి కొంత మంది ఇదే దారి పడతారనే భయంతో జాప్యం చేసినట్లుంది. తుదకు ఆయనే జాతీయ స్థాయిలో సంచనమైనారు. ఆయన ఎపిసోడ్ ఇప్ఫటిది కాదు. ఢిల్లీలో పెద్ద ఎత్తున విందు రాజకీయాలు నడపడం అంతకు ముందే ప్రధాన మంత్రి పలుకరించడాన్ని విస్త్రుతంగా ప్రచారంలో పెట్టినపుడే ఆయన తిరుగుబాటుకు పునాదులు పడ్డాయి.
అప్పటికే పార్టీ క్రమశిక్షణ దాటాడని తేలి పోయింది.

అయితే ఈ సందర్భంలో గమనార్హమైన అంశమేమంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతిపక్షాలను మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ తుదకు రాజ్యాంగ బద్ద సంస్థల ఆదేశాలు భేఖాతరు చేసే విధంగా వ్యవహరిస్తున్నా తమ పార్టీ యంపి విషయంలో మాత్రం డిఫెన్స్ లో పడ్డారు. యంపి రఘురామ కృష్ణ రాజు వైకాపా అధిష్టానం వర్గం ఇచ్చిన అలుసును చాలా లౌక్యంగా చాక చక్యంగా ఉపయోగించు కొన్నారు. వివాదాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు గల వారిని వేధిస్తున్నారనే విషయం పరోక్షంగా వెల్లడి చేశారు. ఒక వేపు తనకు ప్రాణ హాని వుందని జాతీయ స్థాయిలో కథ నడిపిస్తూ ముఖ్యమంత్రిని పార్టీని తను విమర్శించలేదని ఇప్పటికీ చాలా బేలగా బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే రఘు రామ కృష్ణ రాజుకు ఎవరినుండి ప్రాణహాని వుంటుంది.? వైకాపా నుండే కదా?

రఘురామ కృష్ణ రాజు ఎత్తుగడల ముందు వైకాపా అధిష్టాన వర్గం సహజమైన తన దూకుడును తగ్గించుకోవలసి వచ్చింది.  ఆ మాట కొస్తే వైకాపా అధిష్టానం వర్గం కూడా చాలా సందర్భాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించ లేక పోతోంది. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం రాష్ట్ర ప్రజలు సమకూర్చిన అఖండ విజయంతో కొండనైనా ఢీ కొనే వైఖరి మాత్రమే ఇప్పుడు నడుస్తోంది. అంతేకాదు. వైకాపాకు కార్యకర్తలు వున్నారు. గాని పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదు. లేకుంటే యం పి రఘురామ కృష్ణ రాజు లేవ నెత్తినట్లు ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి ఏలా వుంటారు.? ఒక వేళ వున్నా ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాలి కదా?

జగన్మోహన్ రెడ్డి  సుధీర్ఘ పాద యాత్రలో కొన్ని సంవత్సరాలు ప్రజల మధ్య వుండటం చంద్రబాబు నాయుడు అస్తవ్యస్త పరిపాలన అన్నీ కలగలసి వైకాపాకు అధికారం హస్తగతం అయింది. గాని పార్టీ నిర్మాణంపై అప్పుడు గాని ఇప్పుడు గాని దృష్టి పెట్టిన జాడ లేదు. దీని ప్రభావం ఇంకా మున్ముందు బలంగా వుండ వచ్చు. పైగా ప్రజలతో నిత్య సంబంధాలు గలిగి రాజకీయాల్లో అనుభవం గల నేతలు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైకాపా అధిష్టాన వర్గంలో ఎవ్వరూ లేక పోవడం కూడా ఇందుకు తోడైంది. రఘు రామ కృష్ణ రాజు రెండు తీవ్ర మైన ఆరోపణలు చేశారు. ఒకటి. పార్టీ టిక్కెట్ విషయంలో ఆయన చేసిన ఆరోపణలు ముఖ్యమంత్రి వ్యక్తిత్వానికి చెందినవి. కాగా రెండవది ఏ కులం వారినైనా విమర్శించాలంటే ఆ కులం వారిచేత టార్గెట్ చేయించుతున్నారనేది.

రఘు రామ కృష్ణ రాజు చేసిన రెండవ ఆరోపణ ప్రతిపక్షాలు చాలా కాలంగా చేస్తున్నాయి. అధికార పార్టీ యంపి కూడా అదే ఆరోపణ చేయడంతో రాజ ముద్ర పడ్డట్టయింది. తొలి దశలోనే మాట జారినపుడు షోకాజ్ నోటీసు ఇచ్చి వుంటే సరి పోయేది. ఆలా కాకుండా ఆతను ఆరోపించుతున్నట్లు బెదిరింపులతో పాటు జిల్లాలో నిరసన ప్రదర్శనలు దిష్టిబొమ్మల దహనాలకు తలపడటంతో అతను తనకు ప్రాణ హాని ఉందని కేంద్ర బలగాల రక్షణ అవసరమని కోరే అవకాశం వైకాపా అధిష్టాన వర్గమే కల్పించింది. చడీ చప్పుడు లేకుండా అతన్ని పార్టీ నుండి సాగనంపే మార్గాలు అవలంభించకుండా దూకుడు రాజకీయాలకు పాల్పడటంతో అతను కూడా అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు.

 రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే వాతావరణం ఢిల్లీలో రఘు రామ కృష్ణ రాజు సృష్టించారు. కేంద్ర మంత్రుల వద్దనే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు పంచాయతీ తీసుకెళ్లారు. రఘు రామ కృష్ణ రాజు లేవనెత్తిన “లా” పాయింట్లకు ఆశ్చర్య పోవడం ఎన్నికల సంఘం అధికారుల వంతు అయింది. ఈ లాంటి కేసు ఇది వరలో రాలేదని పరిశీలించి చెబుతామనాల్సి వచ్చింది. రేపు ఏం జరుగుతుందో ఏమో గాని ఒక వేళ రఘు రామ కృష్ణ రాజుకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పింప బడితే రాష్ట్ర ప్రభుత్వం పరువు జాతీయ స్థాయిలో ఏం గాను?ఈ పాటికే రమేష్ కుమార్ ఎపిసోడ్ వుండనే వుంది. . ఇక వరస బెట్టి ప్రతిపక్ష నేతలూ తమకు అలాంటి రక్షణ కోరే అవకాశం లేక పోలేదు. స్వంత పార్టీ పార్లమెంటు సభ్యులే కేంద్ర బలగాల రక్షణ కోరినపుడు ప్రతి పక్షాల పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందోననే ఆరోపణలకు విలువలు ఏర్పడతాయి.

ఇదిలా వుండగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బిజెపి జాతీయ నాయకత్వం వరస బెట్టి రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై దాడులు సాగిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తర్వాత సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర మైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కులం గురించి చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు చేయ లేదు. విద్యుత్ గురించి కేంద్ర మంత్రి ఆరోపణల్లో ఎంత వాస్తవముందో పక్కన బెడితే రాష్ట్ర ప్రభుత్వం యెడల కేంద్ర ప్రభుత్వం వైఖరిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. పైగా కేంద్ర మంత్రి ఆరోపణలకు ఒక అధికారి(సలహాదారులూ అధికారులే) చేత జవాబు చెప్పించడంలోని ఔచిత్యమేమిటో?కేంద్ర మంత్రి విద్యుత్ గురించే కాకుండా రాజకీయాలు ప్రస్తావించారు. ఆలాంటప్పుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జవాబు చెప్పివుంటే బాగుండేది.ఈ నేపథ్యంలో తిరుగుబాటు చేసిన రఘు రామ కృష్ణ రాజు పార్లమెంటు సభ్యత్వానికి ఢోకా లేక పోవచ్చు. అదే జరిగితే మరి కొంత మంది ఈ రహదారి పట్ట వచ్చు.