దేవుడికి నైవేద్యంగా సిగరెట్ వెలిగించే ఆలయం.. ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏంటో తెలుసా?

సాధారణంగా భక్తులు దైవదర్శనానికి వెళ్ళినప్పుడు పూలు పండ్లు పలహారాలు దేవుడికి సమర్పిస్తారు. అలాగే చక్కర పొంగలి, దద్దోజనం పులిహోర వంటివి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఏ ఆలయానికి వెళ్లిన ఇదే పద్ధతి కొనసాగుతుంది. గుజరాత్ లో ఉండే ఒక ఆలయంలో పూర్తి భిన్నంగా దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆలయంలో సిగరెట్టు వెలిగించి దేవుడికి నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి విశిష్టత. అసలు ఈ ఆలయం ఎక్కడుంది?దాని చరిత్ర ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లోనున్న కటార్‌గ్రామ్‌ లో ‘వంజరా భూత్‌మామ’ ఆలయంలో దేవుడికి సిగరెట్లు నైవేద్యంగా పెడతారు. ఇలా సిగరెట్లు నైవేద్యంగా పెట్టడం వల్ల భక్తుల కోరికలు తీరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఎక్కడైనా ఆలయం సమీపంలో కొబ్బరికాయలు పూలు దుకాణాలు ఉంటాయి. కానీ ఈ గుడి బయట సిగరెట్‌ షాపులు ఒకదాని వెంబడి ఒకటి దర్శనమియ్యడం విశేషం. ప్రతీ రోజు ఇక్కడ సిగరెట్ షాపు యజమానులు 100కు పైగా సిగరెట్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. అలాగే శనివారాలలో పండుగల సందర్భాలలో 250 కి పైగా సిగరెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయని షాపు యజమానులు చెబుతున్నారు. ప్రత్యేకమైన ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి  తెలుసుకుందాం.

 

130 ఏళ్ల క్రితం వంజరుల సమూహం ఇక్కడ నివసించేది. అప్పుడు ఒక వంజర ఈ మరణించగా, అతని సమాధిని ఇక్కడ నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని వంజర భూత్‌మామ అని పిలుస్తారు. స్థానికులు ఇక్కడ  క్రమంగా వంజరా భూత్‌మామ ఆలయం నిర్మించారు. భూత్‌మామ గుళ్లో సిగరెట్‌ వెలిగించి మొక్కుకుంటే ఆరోగ్యం, వివాహం, సంతానలేమి వంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల అపారనమ్మకం. ఈ విధంగా గత 12-13 సంవత్సరాలుగా భక్తులు ఆలయంలో సిగరెట్లు వెలిగించి దైవానికి నైవేద్యంగా పెట్టి కొలుస్తున్నారు. అలాగే మగాస్‌ అనే మిఠాయిలు భూత్‌మామకు నైవేద్యంగా సమర్పిస్తారు. అమావాస్య నాడు ఆ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.