ఇంట్లో సంపదకు లోటు లేకుండా ఉండాలంటే సంక్రాంతి రోజున ఇలా చేయాలి ..?

మన హిందూ ధర్మంలో సంక్రాంతి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ మొదటి రోజున భోగి రెండవ రోజున మకర సంక్రాంతి మూడవ రోజున కనుమ పండుగ జరుపుకుంటారు. ధనుర్మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి జరుపుకోవడం పురాణాల నుండి ఆనవాయితీగా వస్తోంది. ఈ సంక్రాంతి పండుగ రోజున పూజా కార్యక్రమాలకు, దానధర్మాలకు చాలా ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ రోజున కొన్ని నియమాలు పాటించేటప్పుడు వల్ల ఏడాది పాటు ఇంట్లో సంపదకు ఎటువంటి లోటు ఉండదు.

సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే గంగాజలంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. అంతేకాకుండా ఇంట్లో కూడా పూజ చేసి బియ్యం, పెసరలు కలిపి పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇక సంక్రాంతి పండుగ రోజున దానధర్మాలకు చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా సంక్రాంతి రోజున నల్ల నువ్వులు దానం చేయటం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. దీంతో మనపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయి.

ఇక సంక్రాంతి పండుగ రోజున తులసి మాతను పూజించటం కూడా చాలా ప్రత్యేకం. సంక్రాంతి రోజున తులసి మాతకు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండటమే కాకుండా ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అలాగే ఈ పండుగ రోజున ఇంటికి వచ్చిన కొత్త ధాన్యాన్ని నిరుపేదలకు దానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. ముఖ్యంగా ఈ పండుగ రోజున ఇంటి ముందు రంగు ముగ్గులు వేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి పెట్టాలి అలా చేయటం వల్ల కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉంటారు.