2023వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఆలయాలకు వెళ్లి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల దర్శనంతో ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు. అందువల్ల ఉత్తర ద్వారా దర్శనం కోసం తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాల ప్రాంగణాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా భక్తుల రద్దీ భారీగా ఉంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకోవడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారి నిదర్శించుకోవడానికి తిరుమల దేవస్థానానికి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి దేవస్థానాన్ని రకరకాల విద్యుత్ దీపాలతో రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరించారు. ఒకటవ తేదీన స్వామివారికి కైంకర్యాలు పూర్తయ్యాక 12.5 గంటల సమయంలో భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.
వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్న తిరుమల టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ..అర్దరాత్రి 1.30 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించామని వెల్లడించాడు. అలాగే ఉదయం 6 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించినట్లు స్పష్టం చేశాడు. అయితే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి ఉంటుంది. భక్తులు ఆన్ లైన్ ద్వారా దర్శన టికెట్లు పొందవచ్చు. వైకుంఠ ధార దర్శనానికి సంబంధించి రోజుకు 20 వేల టికెట్లను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేసినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించాడు.