తిరుమలలో వనభోజనం నవంబర్ 22 !

తిరుమలలో ఈసారి కార్తీకమాసోత్సవాలను భాగంగా కార్తీక వనభోజన కార్యక్రమం నవంబరు 22వ తేదీన ఆదివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది.
ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకీపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఉదయం 10 గంటలకు పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.

ప్రాశస్త్యం
పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతి ఒడిలో చెట్ల నడుమ నిర్వహించే ఈ వనభోజనాలకు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. కార్తీకమాసం శివుడికి, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనది. ఈ మాసంలో పవిత్ర స్నానాలు, దానాలు, దీపారాధన, వనభోజనాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మితో కలిసి ఉసిరి చెట్టు కింద నివసిస్తారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఉసిరి, తులసి, వేప, రావి, బిల్వ తదితర వృక్షాలను ప్రార్థించడం, పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించడం ద్వారా కార్తీకమాసంలో మంచి ఫలితాలు వస్తాయి.