తిరుమలలో సాలకట్ల బ్రహో్త్సవాలలో మూడోరోజు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం, రాత్రి స్వామి వారికి వాహన సేవలు జరుగాయి. వాటి వివరాలు…
సింహవాహనం :శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం మలయప్పస్వామి సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగోది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి, వేగానికి సంకేతంగా భావిస్తారు. సింహబలమంతటి భక్తిబలం భక్తుడు కలిగి ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడని ఈ వాహనసేవలో అంతరార్థం.
ముత్యపుపందిరి వాహనం :మూడో రోజు రాత్రి మలయప్పస్వామి ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాలను చంద్రునికి ప్రతీకగా భావిస్తారు. శ్రీకృష్ణుడు ముక్కు, మెడలోనూ ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్త్రోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.