విజయం.. అంటే మనిషికి ఆనందం. అదే జీవితాన్ని నడిపిస్తుంది. దానికోసం ప్రతీ ఒక్కరు ఏదో ఒక దానికోసం తపిస్తూ శ్రమిస్తూ జీవిస్తారు. అయితే దానికోసం సనాతన ధర్మంలో చెప్పింది మానవ ప్రయత్నంతోపాటు పౌరష ప్రయత్నం కూడా జతకావాలని. దీనికోసం కొన్ని అపూర్వమైన సమయాలను పేర్కొంది జ్యోతిషశాస్త్రం. అటువంటి వాటిలో విజయదశమి మూహుర్తం ఒకటి. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం…
దుర్గాదేవి నవరాత్రుల్లో చివరి అంకం పూర్ణాహుతి. ఈ క్యార్యక్రమాన్ని దశమినాడు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారి జన్మనక్షత్రం శ్రవణం ఉండే రోజు. శ్రవణంతో కూడుకున్న దశమినే విజయదశమిగా నిర్వహించుకుంటారు. ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి విజయా అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తప్పక వరిస్తుంది. దీనికి సంబంధించి చతుర్వర్గ చింతామణిగ్రంథంలో ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఈ పవిత్ర సమయం సకల వాంచితార్ధ సాధకమైందని పండితులు పేర్కొంటున్నారు. పరీక్షల్లో విజయం సాధించాలనుకునేవారు, జీవితంలో మంచి స్థితి పొందాలనుకునేవారు, జ్ఞానసముపార్జన, మోక్షసిద్ధి కలుగాలనుకునేవారు ఇలా ఆయా రంగాలకు సంబంధించిన ప్రతీ ఒక్కరు ఈ సమయంలో తమ పనిని ప్రారంభిస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది.