హంస వాహనంపై శ్రీ మలయప్ప

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 17న రెండో రోజు శనివారం రాత్రి 7.00 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.


హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.