శరన్నవరాత్రులు అక్టోబర్ 17న ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నవరాత్రులలో ఆయా రూపాలలో అమ్మవారిని అలంక రించి, ఆవాహనం చేసి పూజిస్తారు. మొదటిరోజు పూజ చేసే ఫలితాలు.. అమ్మవారు అంటే మొదట గుర్తుకు వచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ. ఇక్కడి అమ్మవారిని మొదటి రోజు ‘స్వర్ణ కవచాలంకృత దేవి’గా అలంకరిస్తారు.
పూర్వం విజయవాడని విజయవాటిక అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ విజయవాటికను మాధవవర్మ అనే రాజు పాలిం చేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు. మాధవవర్మ పాలనలో రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. ధర్మం నాలుగు పాదాలా నడిచేది. అలాంటి సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. మాధవవర్మ కుమారుడు ఒకసారి రథం మీద తిరుగుతుందగా, ఆ రథం కింద పడి ఓ బాలుడు చని పోయాడు. పొరపాటున జరిగినా కూడా అమాయకుడైన ఓ పిల్లవాడి ప్రాణాలను బలిగొన్నందుకు రాజుగారు విచారించారు. తన కొడుకని కూడా చూడకుండా మరణశిక్ష విధించారు. మాధవవర్మ నిజాయితీకి అమ్మవారు చాలా సంతోషించారు. ఆ రాజ్యం అంతా బంగారు వర్షాన్ని కురిపించారు. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గగా పిలుస్తున్నారు. ఆవిడ అనుగ్రహంతో ఏ ఇంట్లో అయినా సిరుల వర్షం కురుస్తుందని నమ్ము తున్నారు. దసరా మొదటి రోజున అమ్మవారిని బంగారపు ఆభరణాలతో అలంకరించి. ఆమెను స్వర్ణ కవచాలంకృతగా పూజిస్తున్నారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని చూసినా, పూజించినా… ఇంట్లో ఉన్న దారిద్ర్యమంతా తీరిపోతుందని ప్రతీతి.