సూపర్ స్టార్ రజనీకాంత్.. కేవలం తమిళ సినీ ప్రేక్షకులకే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులకీ, హిందీ సినీ ప్రేక్షకులకీ సుపరిచితుడే. బాలీవుడ్ స్టార్లు సైతం, రజనీకాంత్ స్టయిల్‌కి ఫిదా అయిపోవాల్సిందే. దటీజ్ రజనీకాంత్. సినీ నటుడిగా ఎంత గొప్పోడైతేనేం, రాజకీయాల్లోకొస్తే అంతే సంగతులు. మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి ఏమయ్యింది.? విజయ్‌కాంత్ పరిస్థితి ఏమయ్యింది.? ఇకపై రజనీకాంత్ పరిస్థితి ఏం కాబోతోంది.? పైగా, తమిళనాడులో స్నేహితుడు కమల్‌హాసన్ కూడా కొత్త పార్టీతో బిజీగా వున్న నేపథ్యంలో రజనీకాంత్ వచ్చి కొత్తగా అక్కడ ‘పీకేదేముంది.?’ అన్న చర్చ తమిళ సినీ వర్గాల్లో జరుగుతోంది. అంతలా రజనీకాంత్ మీద అక్కడ వ్యతిరేకత పెరగడానికి కారణం, రజనీకాంత్ తమిళుడు కాదు.
శివాజీరావ్ గైక్వాడ్ అనేది రజనీకాంత్ అసలు పేరు. మహారాష్ట్రలో పుట్టి, కర్నాటకలో ఎదిగి.. తమిళనాడులో సెటిలయ్యాడు రజనీకాంత్. అలాగని, ఆయన రాజకీయ పార్టీ పెట్టకూడదు.. అని తమిళనాడులో ఎవరన్నా అంటే అంతకన్నా హాస్యాస్పదమింకోటుండదు. కానీ, తమిళనాడులో సెంటిమెంట్లు వేరేలా వుంటాయ్. ‘స్థానికేతరుడు’ అన్న విమర్శని ఇప్పటికే రజనీకాంత్ చాలా దారుణంగా ఎదుర్కొంటున్నాడు. సినిమా నటుడిగా ఓకే, రాజకీయ నాయకుడై మమ్మల్ని ఉద్ధరిస్తామంటే కుదరదు.. అని తెగేసి చెబుతున్నారు తమిళజనాలు.
సెంటిమెంట్ కార్డుని ముందే వాడేసిన రజనీకాంత్..
రజనీకాంత్ కొంత కాలం క్రితం తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డాడు. ఓ దశలో ఆయన బతికి బట్టకట్టడం కష్టమన్న ప్రచారం జరిగింది. కానీ, విదేశాల్లో వైద్య చికిత్స అనంతరం కోలుకున్నాడు రజనీకాంత్. రజనీకాంత్, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల అధికారికంగా వెల్లడయ్యింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నేపథ్యంలో ఇమ్యూనిటీ తక్కువ వుండాలి.. కానీ, కరోనా వైరస్ నేపథ్యంలో ఇమ్యూనిటీ ఎక్కువ వుండాలి.. జనంలో తిరిగితే అంతే సంగతులు. ఇదీ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి. కానీ, జనం కోసం.. తనను ఇంతవాడ్ని చేసిన తమిళుల కోసం రాజకీయాల్లోకి వస్తున్నాననీ, రాజకీయ పార్టీని ప్రకటిస్తాననీ రజనీకాంత్ స్వయంగా ఈ రోజు వెల్లడించారు. డిసెంబర్ 31న ప్రకటన, జనవరిలో పార్టీ కబురు అందించేస్తారట. అయితే, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పేరుతో.. ట్రంప్ కార్డ్‌ని రజనీకాంత్ ముండే వాడేయడం ఆశ్చర్యకరమని తమిళ జనాలు అంటున్నారు. నిఖార్సయిన పొలిటీషియన్‌లా రజనీకాంత్ సెంటిమెంట్ కార్డుని ప్లే చేశారన్నది వారి వాదన.
స్వాగతించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్..
‘రజనీకాంత్ నాకు మిత్రుడు..’ అంటూ అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన స్టయిల్లో రజనీకాంత్‌కి మద్దతు ప్రకటించేశారు. ‘కొత్తగా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా స్వాగతించాల్సిందే.. ఆయనకంటూ ఓ సమూహం వుంది.. ఆ సమూహాన్ని ఆయన ప్రభావితం చేయగలరు.. రాజకీయాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడే, రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుంది..’ అని పవన్ కళ్యాణ్; మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
రజనీకాంత్ పార్టీలో చేరన్ను లారెన్స్
రజనీకాంత్ గనుక రాజకీయాల్లోకి వస్తే అందరికన్నా ముందు తానుండి, ఆ పార్టీ కోసం పనిచేస్తానని ఎప్పటినుంచో చెబుతున్నాడు కొరియోగ్రాఫర్ లారెన్స్. ఇప్పుడు రజనీకాంత్ నుంచి ప్రకటన వచ్చిన దరిమిలా, తన ఫుల్ సపోర్ట్ రజనీకాంత్‌కేనని లారెన్స్ ప్రకటించేయడం గమనార్హం. మరోపక్క, రజనీకాంత్ అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే, తమిళనాడు రాజకీయాల్ని బీజేపీ హై కమాండ్ శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయగలరు.? అన్నది ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.