కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాదైనా ఎన్టీవీ ‘కోటి దీపోత్సవం’ జరిగేనా..?

ప్రముఖ వార్తా చానెల్ ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా వేలమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సంస్థకే చెందిన భక్తి చానెల్ ద్వారా కార్యక్రమం ప్రసారం అవుతుంది. సంస్థ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తూంటారు. మొద‌ట్లో ల‌క్ష దీపోత్సవంగా మొద‌లైన ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. దీంతో లక్ష దీపోత్సవం.. కోటి దీపోత్సవంగా.. అనంతరం శ‌తకోటి దీపోత్సవంగా మారి విజయవంతంగా కొనసాగుతోంది.

కార్తీకమాసం ప్రత్యేకత, దీపం ప్రాముఖ్యత‌ను వివరిస్తూ.. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల నుంచి గణపతి సచ్చిదానంద, పండిట్ రవిశంకర్.. స్వామీజీలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది గతంలో కోటి దీపోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏటా అట్టహాసంగా జరిగుతున్న ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి గతేడాది కరోనా బ్రేక్ వేసింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ తీవ్రత ఈ ఏడాది జరపతలపెట్టిన కార్యక్రమంపై నీలినిడలు కమ్మేలా చేసింది. దీంతో ఈ ఏడాదైనా కార్తీక దీపోత్సవం జరుగుతుందా..? లేదా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కార్తీకమాసంలో భక్తులు ఎక్కువగా పాల్గొనే ఈ కార్యక్రమం ఈ ఏడాది నిర్వహణపై నరేంద్ర చౌదరి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా కార్తీకమాసం ప్రారంభమయ్యే నెలలోనే ఈసారి థర్డ్ వేవ్ వస్తుందనే నిపుణుల మాటలు కార్యక్రమ నిర్వహణపై నీళ్లు జల్లుతున్నాయి. కాబట్టి.. ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని నరేంద్ర చౌదరి ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో ఈ ఏడాదైనా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నరేంద్ర చౌదరి నిర్వహిస్తారో లేదో..? తెలియాల్సి ఉంది.