సాధారణంగా దేవుని ప్రార్థించేటప్పుడు దేవుడికి పుష్పాలు సమర్పించి దేవుడు ముందు దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా దేవున్ని ప్రార్థించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అయితే ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన పుష్పాలు ప్రీతిపాత్రమైనవిగా ఉంటాయి. ఇలా ఆ దేవుళ్లకు ప్రీతిపాత్రమైన పుష్పాలతో పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి, శివుడు , శని, హనుమంతుడిని ప్రత్యేక పుష్పాలతో పూజించటం వల్ల జీవితంలో అనుకున్నది నెరవేరి జీవితాంతం సుఖసంతోషాలతో జీవిస్తారు.
లక్ష్మీదేవి : ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలంటే డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ దేవుని పూజించి దేవి అనుగ్రహం పొందటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆ దేవికి ఇష్టమైన తామర పువ్వులను సమర్పించి పూజించడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా అమ్మవారిని పూజించేటప్పుడు పుష్పాలు చెడిపోకుండా పొడి బారకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
శని దేవుడు : శనిదేవుని అనుగ్రహం పొందటానికి ఆ దేవుడిని ఎన్నో రకాల పుష్పాలతో పూజిస్తూ ఉంటారు. శని దేవుడికి ఇష్టమైన శమీ పుష్పాలతో ఆ దేవున్ని పూజించటం వల్ల శని దేవుని అనుగ్రహం పొంది ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా శని దేవుని పూజించేటప్పుడు ఆయనకు ఇష్టమైన నీలిరంగు పుష్పాలను సమర్పించి పూజించటం వల్ల కూడా ఆ దేవుని అనుగ్రహం పొంది సంతోషంగా జీవించవచ్చు.
శివుడు : సర్వలోకాధిపతి అయిన ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందటానికి ప్రజలు నిత్యం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. పరమశివుని పూజించేటప్పుడు ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన గంట పువ్వులను సమర్పించి ఆరాధించడం వల్ల శివుని అనుగ్రహం పొంది కోరిన కోరికలు నెరవేరి సంతోషంగా జీవించవచ్చు.
హనుమంతుడు : హనుమంతుడిని పూజించేటప్పుడు ఆ దేవునికి ఇష్టమైన మందార పూలు సమర్పించి పూజించటం వల్ల హనుమంతుడి అనుగ్రహం పొందవచ్చు. అంతేకాకుండా హనుమంతుడికి బంతిపూలు కూడా చాలా ప్రీతిపాత్రమైనవి. అందువల్ల హనుమంతుని ఎల్లప్పుడూ బంతిపూలు, మందార పూలతో పూజించాలి.