మన హిందూ పురాణాల ప్రకారం వారంలో ఉన్న ఏడు రోజులు కూడా ఒక్కో దేవుడి పూజకు అంకితం చేశారు. ఇలా ప్రతి రోజు ఒక్కో దేవుడిని పూజించటం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ముఖ్యంగా బుధవారం రోజున గణపతి పూజకు అంకితం చేశారు. గణపతికి ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆ విగ్నేశ్వరుడిని పూజించటం వల్ల సకల విఘ్నాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. ఏదైనా పని, పూజ, లేక ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందుగా విగ్నేశ్వరుడిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా బుధవారం రోజున గణపతిని పూజించే సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు దూరం అవుతాయి
బుధవారం రోజున గణపతి పూజ సమయంలో పాటించవలసిన నియమాలు :
• బుధవారం రోజున గణపతిని పూజించే సమయంలో ఆ విగ్నేశ్వరుడికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలు గరిక సమర్పించి విగ్నేశ్వరున్ని పూజించాలి. ఇలా గణపతికి ఇష్టమైన ఎర్రటి పువ్వులతో గరికతో పూజ చేయటం వల్ల ఆ విగ్నేశ్వరుడి అనుగ్రహం పొంది జీవితంలో ఎదురైన కష్టాలు అన్నీ కూడా దూరమవుతాయి.
• ఇక గణపతి పూజ సమయంలో నైవేద్యం సమర్పించడం కూడా చాలా ముఖ్యమైన ఘట్టం. నైవేద్యం సమర్పించకపోతే పూజ అసంపూర్తిగానే ఉంటుంది. అందువల్ల ప్రతి బుధవారం రోజున గణపతి పూజ సమయంలో ఆ గణపతికి ఇష్టమైన మోదకాలను నైవేద్యంగా పెట్టాలి. వీలు కానీ సమయంలో అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టిన కూడా ఆ గణపతి అనుగ్రహం లభిస్తుంది.
• హిందూ సంప్రదాయంలో ముడి బియ్యం లేదా అక్షతలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని పూజలో ఉపయోగించి దేవుడికి సమర్పించి నమస్కరిస్తారు. ఇక గణపతి పూజలో కూడా అక్షతలను ఉపయోగించడం ద్వారా గణపతి ప్రసన్నుడై అనుగ్రహాన్ని కురిపిస్తాడని నమ్మకం.
• బుధవారం రోజున గణపతి ఆలయానికి వెళ్ళటం కుదరకపోతే ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని పూజించవచ్చు. ఒకవేళ ఇంట్లో విగ్రహం లేకపోయినా కూడా తమలపాకులో పసుపు గణపతిని ప్రతిష్టించి పూజించటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
• ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా జీవితంలో కష్టాలు ఎదురవుతుంటే…ప్రతి బుధవారం నాడు ‘ఓం గం గణపతయే నమః ‘ లేదా ‘ ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్’ అనే మంత్రాన్ని జపిస్తూ గణపతి పూజ ఆచరించి ఆ గణపతి ముందు దీపాన్ని వెలిగించడం వల్ల జీవితంలో వచ్చిన కష్టాలు అన్ని తొలగిపోతాయి.