మన దేశంలో ఎటువంటి శుభకార్యం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుని ఆశీర్వాదం కోరడం ఆనవాయితీ. విఘ్నాలను తొలగించే వినాయకుడు, తనకు ప్రీతిపాత్రమైన గరికతో పూజిస్తే భక్తుల జీవితంలో శాంతి, సంపద, వంశ వృద్ధి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. గణపతిని ఆరాధించే పద్ధతులు ఎన్నో ఉన్నా, గరికతో చేసే పూజ ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. గరిక అనేది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. గరికతో స్వామివారిని ఆరాధిస్తే శరీర, మనసుకు శాంతి కలుగుతుందని, ఆయుర్వేదం ప్రకారం ఇది రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుందని నమ్మకం.
గరికతో వినాయకుడి అనుబంధానికి ఒక విశేషమైన పురాణకథ ఉంది. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు తన అగ్ని శక్తితో ప్రపంచాన్ని దహించివేస్తూ దేవతలను సైతం ఇబ్బంది పెట్టాడంట. దేవతల ప్రార్థనలతో గణపతి ఆ రాక్షసుడిని మింగేశాడంట.. రాక్షసుడి అగ్ని శక్తి కారణంగా గణపతి శరీరమంతా మండిపోవడం మొదలైంది. ఈ వేడిని తగ్గించడానికి దేవతలు గరికను సమర్పించగా, అది గణపతికి శాంతిని కలిగించింది. ఆ రోజు నుండి గరిక గణనాథుడికి అత్యంత ప్రీతికరమైనదిగా మారింది. అందుకే భక్తులు నేటికీ వినాయకుడిని గరికతో ప్రత్యేకంగా పూజిస్తున్నారు.
గరిక స్వభావం కూడా చాలా ప్రత్యేకం. భూమి మీద పాకుతూ పెరిగే ఈ మొక్క, ఒక భాగం తెంపినా మరో చోట వేర్లు తొడిగి మళ్లీ పెరుగుతుంది. ఈ వృద్ధి గుణం కారణంగానే గరికతో గణపతిని పూజిస్తే వంశ వృద్ధి, గోత్ర వృద్ధి, సంపద వృద్ధి జరుగుతుందని నమ్మకం ఉంది. అదే విధంగా, గరికతో పూజించే వారు మానసిక శాంతి, ఆరోగ్య క్షేమం, కుటుంబంలో ఐక్యత పొందుతారని అర్చకులు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాకుండా శాస్త్రీయ కోణం నుంచీ గరిక ప్రాముఖ్యత ఉంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తస్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి గరికతో గణపతిని ఆరాధించడం వల్ల భౌతిక, ఆధ్యాత్మిక లాభాలు రెండూ లభిస్తాయి. మొత్తానికి, గరికతో గణపతిని పూజించడం వలన పాపాలు తొలగిపోవడమే కాకుండా వంశాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, సంపద వృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితి సమయంలో గరికతో పూజించడం మరింత విశేషమైన ఫలితాలను ఇస్తుందని భక్తులు నమ్ముతున్నారు.
