తిరుమల శ్రీవారికి పుష్పయాగం !

కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీన్ని పదిహేనో శతాబ్దం నుంచి నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. విశేషాల్లోకి వెళితే…
పూర్వం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోందన్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తున్నారు. శ్రీవారి పుష్ప యాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగించారు. ఇందులో సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా పుష్పార్చన నిర్వహించినట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా శనివారం ఉదయం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపా నికి వేంచేపు చేశారు. ఇందులో భాగంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వివిధ రకాల పూలు, పత్రాలతో స్వామి వారికి పుష్పార్చన చేశారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ ఉంటుంది. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.
పుష్పార్చన కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 7 టన్నుల పూలను టీటీడీ సేకరించింది. భక్తులు విరాళంగా పంపిన ఈ పూలకు ముందుగా పూలమాలలు తయారు చేసే గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. పుష్పయాగాన్ని పురస్కరించుకొని ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని దేవస్ధానం రద్దుచేసింది.