మకర సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే బోగి పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

హిందూ సంస్కృతిలో సంక్రాంతి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలం నుండి తెలుగు ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది అనే విధంగా ప్రజలందరూ ఈ పండుగని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. మూడు రోజులపాటు జరుపుకొని ఈ సంక్రాంతి పండుగ ప్రజలకు చాలా ప్రత్యేకమైనది. మూడు రోజులపాటు జరుపుకొని ఈ పండుగలు మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి,మూడవ రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇల్లు రంగురంగుల రంగవల్లులతో పువ్వులతో అందంగా అలంకరించి హరిదాసులు కీర్తనలతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పట్టణాలలో ఉండే ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళుతూ ఉంటారు. మకర సంక్రాంతి రోజున రకరకాల పిండి వంటలను తయారుచేసి ఇంటిముందు రంగుల ముగ్గులు వేసి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు.

ఈ భోగి పండుగ కి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. భోగభాగ్యాలు ప్రసాదించే ఈ భోగి పండుగకు చాలా విశిష్టత ఉంది. భోగి పండుగ రోజున ప్రజలందరూ పులగం, రొట్టెలు తయారు చేసుకుంటారు. అలాగే ఈ భోగి పండుగ రోజున భోగిమంటలు వేస్తారు. ఇంట్లో ఉన్న పాత సామాన్లు పనికిరాని వస్తువులను ఈ భోగిమంటలలో కాల్చివేసి తమ జీవితంలో సుఖ సంతోషాలు రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. భోగి పండుగ రోజున వేసే భోగి మంటల్లో మన లో ఉన్న చెడు స్వభావాలు బద్ధకాన్ని తరిమికొట్టి ఆరోజు నుంచి సరికొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఇక భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయటం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం ద్వారా వారి మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి పిల్లలు ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉంటారు.