హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మాసాలలో కార్తీకమాసం ఒకటి.కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది కనుక కార్తీక మాసంలో ఎంతోమంది ఉపవాసాలతో నియమనిష్టలతో ఎలాంటి మాంసాహారాలను తినకుండా పెద్ద ఎత్తున శివ కేశవులను ఆరాధిస్తూ ఉంటారు. ఈ కార్తీకమాసం మొత్తం ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున ఇంటి ఆవరణంలో దీపాలను అలంకరించి పూజలు చేస్తుంటారు. ఇక కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున పెద్ద ఎత్తున భక్తులు శివుడి ఆలయాలను సందర్శించి 365 ఒత్తులను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఇలా కార్తీక పౌర్ణమి రోజు 365 వొత్తులను వెలిగించి పూజ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే…మనకు సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి అయితే మనం ఏడాది మొత్తం దీపాలు వెలిగించి పూజ చేయకపోయినా కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరానికి సరిపడా 365 వొత్తులను వెలిగించి పూజ చేయడం వల్ల ఏడాది మొత్తం మనకు దీపారాధన చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను శివాలయాలలోనే వెలిగించాలనే నియమం ఏమీ లేదు.
శివాలయాలు అందుబాటులో లేని వారు ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి తులసి కోట ముందు వెలిగించినా శుభప్రదం. అదేవిధంగా మన ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఆలయాలలో కూడా ఇలా 365 ఒత్తులను వెలిగించి పూజ చేయడం వల్ల శివకేశవల అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి మనకు సకల సంపదలు అష్టైశ్వర్యాలను కలిగిస్తారని భావిస్తారు.ఈరోజు చేసే దీపారాధన వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అదే విధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేయించిన లేదా సత్యనారాయణ స్వామి వారి కథ విన్నా కూడా ఎంతో శుభసూచికంగా భావిస్తారు.