హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం అంటేనే భక్తి, పవిత్రత, పుణ్యానికి ప్రతీక. ఈ మాసం అంతా శివకేశవుల ఆరాధనతో గడిపే వారు శాశ్వత శాంతిని పొందుతారని శాస్త్రాలు పేర్కొంటాయి. అయితే ఈ నెలలో వచ్చే చివరి సోమవారం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ రోజున చేసే ఒక్క ఆరాధన కూడా కోటి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఆరోజున సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర స్నానం చేయడం ఈ దినం ఆరంభానికి శుభసూచకం. గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం శుద్ధిని ఇస్తుందని విశ్వసిస్తారు. స్నానం అనంతరం ఇంటి పూజామందిరాన్ని శుభ్రపరచి, శివలింగానికి దీపారాధన చేయడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది.
ఈ రోజున ఉపవాసం అత్యంత శ్రేష్ఠం. శరీరానికి శక్తి లేకుంటే పాలు, పండ్లతో ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగాభిషేకం చేయడం, బిల్వపత్రాలు సమర్పించడం, మారేడు దళాలతో పూజించడం శివానుగ్రహాన్ని మరింత పెంచుతాయి. రోజంతా ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించడం ఈ దినానికి ప్రాణం లాంటిది. శివతాండవ స్తోత్రం లేదా లింగాష్టకాన్ని పఠిస్తే మనసు ప్రశాంతమై, కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. సాయంత్రం వేళ నది ఒడ్డున లేదా ఆలయ పరిసరాల్లో దీపదానం చేయడం కార్తీక పుణ్యాన్ని మరింత పెంచుతుంది.
ఈ పవిత్ర సోమవారం దానధర్మాలు చేయడం వంద రెట్లు పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సాత్విక ఆహారాన్ని స్వామికి నివేదించి, పేదవారికి భోజనం పెట్టడం లేదా వస్త్రదానం చేయడం ద్వారా జీవితంలో ఉన్న ప్రతిబంధాలు తొలగిపోతాయి.కార్తీక మాసం చివరి సోమవారం శివారాధన కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. అది భక్తుడి ఆత్మశుద్ధికి దారి తీసే పవిత్ర మార్గం. ఒకరోజు నిశ్శబ్దంగా, భక్తితో గడిపినా ఆ శివానుగ్రహం జీవితాంతం కాపాడుతుందనే నమ్మకం ఉంది.
