Kartika Masam: కార్తీక మాసంలో.. శివారాధన ఇలా చేస్తే కోటిగుణాల ఫలితమంట..!

సంవత్సరంలోని అన్ని మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ఈ పుణ్యకాలంలో శివుడు, కేశవుడు ఒకే రూపంలో అనుగ్రహిస్తారని, ఈ నెలలో చేసే ఆరాధన అపారమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తీక పురాణంలో చెప్పినట్లుగా ఈ మాసంలో జరిగే దీపారాధనలు, అభిషేకాలు, దానధర్మాలు సాధారణ కాలంలో చేసిన పుణ్యకార్యాల కంటే కోటిగుణాల ఫలితాన్ని అందిస్తాయని అంటున్నారు.

పురాణాలలో చెప్పినట్లుగా, ఈ నెలలో పరమశివుడు విష్ణురూపంలో దర్శనమిస్తాడు, విష్ణుమూర్తి శివస్వరూపంలో అనుగ్రహిస్తాడు. అందువల్ల ఈ మాసంలో “శివ–కేశవులు భిన్నులు కాదు అనే తత్త్వాన్ని మనం ఆచరణలో అనుభవిస్తామన్నారు శర్మ. ఎవరు ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో శివుని గాని, కేశవుని గాని ఆరాధిస్తారో వారు జీవితంలో అపారమైన పుణ్యాన్ని పొందుతారని చెప్పారు.

కార్తీక సోమవారాలు ఈ మాసానికి ప్రత్యేక శోభను ఇస్తాయి. అభిషేక ప్రియుడైన పరమశివుడికి ఈ రోజుల్లో అభిషేకం చేసి, మారేడు దళాలతో అర్చన చేస్తే ఆయన అత్యంత ప్రీతిపాత్రుడవుతాడని పండితులు చెబుతున్నారు. ఒక మారేడు దళాన్ని కూడా మనస్ఫూర్తిగా సమర్పిస్తే అనేక జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. దళం సమర్పించాలనే సంకల్పమే పాప విమోచనానికి దారి తీస్తుందని తెలిపారు.

మారేడు దళం కేవలం శివార్చనకే కాదు, శ్రీమహావిష్ణువుకూ అత్యంత ప్రీతిపాత్రమైనది. సాధారణంగా మూడు ఆకులతో ఉండే మారేడు దళం “త్రిగుణాత్మక”మైందిగా భావిస్తారు. ఆ మూడు ఆకులు సత్యం, జ్ఞానం, అనంతం అనే పరమాత్మ స్వరూపాన్ని సూచిస్తాయని ఆయన వివరించారు. ఈ దళాన్ని వేరు చేయకుండా సమర్పిస్తే భక్తుడు విశేషమైన ఫలితాలను పొందుతాడని పేర్కొన్నారు.

తొమ్మిది ఆకులతో ఉండే దళం అతి మారేడు దళం గా పిలుస్తారు. దానిని సమర్పించిన భక్తుడికి మరింత ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుందని అన్నారు. భక్తుడి శ్రద్ధ, విశ్వాసమే పరమాత్మకు ముఖ్యమని. భక్తి ఏ రూపంలోనైనా, ఏ విధంగానైనా వ్యక్తమైతే దానిని పరమేశ్వరుడు సంతోషంగా స్వీకరిస్తాడని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో దీపదానం, తులసీదళార్పణం, మారేడు దళార్పణం వంటి ఆచారాలు కేవలం పూజా విధులు మాత్రమే కాకుండా, మనసును పవిత్రం చేసే ఆధ్యాత్మిక యాత్ర అని శర్మ పేర్కొన్నారు. ఈ మాసం భక్తుని మనసులో శాంతిని నింపి, ఆత్మను ధర్మమార్గంలో నడిపి, ఐశ్వర్యం, ఆనందం, సౌభాగ్యం కలిగించే శక్తిని కలిగినదని వివరించారు.

ఇతర ఆధ్యాత్మిక పండితులు కూడా ఈ నెలలో శివాలయాల్లో దీపములు వెలిగించడం, కేశవాలయాల్లో తులసీదళం సమర్పించడం వలన కుటుంబంలో శుభం, ఆరోగ్యం, సౌఖ్యం పెరుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదమని పండితులు చెబుతున్నారు.