వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.
తిరుమలలో సుప్రభాత విశేషాలు ఇవే !
హిందువుల ఇండ్లలో తెల్లవారు ఝామున నిత్యం వినబడేది ‘‘కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే’’ అనే సుప్రభాత శ్లోకాలు తప్పనిసరిగా వింటూంటాం. అయితే మరి సాక్షాత్తు శ్రీవారి ఆనందనిలయంలో సుప్రభాతాన చేసే సేవనే సుప్రభాత సేవ అంటారు. ఆ విశేషాలు ఇవే…
నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే… ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు.
వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ… అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.