శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం !

తిరుమల, 2020 సెప్టెంబరు 27:  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 6.00 నుంచి 9.00 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని అయిన మహల్ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

 chakrasnanam in tirrumala srivari salaktla brahmotsavalu
chakrasnanam in tirrumala srivari salaktla brahmotsavalu

అనంతరం అయిన మహల్ ముఖ మండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.

 chakrasnanam in tirrumala srivari salaktla brahmotsavalu
chakrasnanam in tirrumala srivari salaktla brahmotsavalu

 అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణ దారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.