హనుమంతుడు.. ఆంజనేయుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. భోళాశంకరుడు వలే ఆయన కేవలం భక్తికి పొంగిపోతాడు. రామనామ కీర్తనకు ఆయన సంతోషిస్తాడు. అనుగ్రహిస్తాడు. అయితే ఆ స్వామికి కొన్ని పూలు, ఆకులు అంటే ఇష్టం అని ఆయా పురాణాలలో ఉంది. వాటి విశేషాలు తెలుసుకుందాం.. సీతారాములు ప్రీతిచెందడం కోసమే ఆయన సిందూరం ధరించాడనీ, తమలపాకుల మాలను ధరించాడని అంటారు. అందుకే హనుమంతుడిని ఎవరైతే అనునిత్యం సేవిస్తూ వుంటారో, అలాంటివారికి తమ అనుగ్రహం తప్పక లభిస్తుందని సీతారాములు సెలవిచ్చారు.
అలాంటి హనుమంతుడు అనేక క్షేత్రాల్లో అర్చామూర్తిగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. హనుమంతుడికి పూలంటే మహాఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మల్లెలు .. సన్నజాజులు .. సంపెంగలు .. పొగడలు .. పొన్నాగులు .. మందారాలు .. కనకాంబరాలు .. గులాబీలు మరింత ఇష్టమట. హనుమంతుడికి ప్రీతికరమైన ఈ పూలతో ఆ స్వామిని పూజించడం వలన ఆయన అనుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుంది. హనుమంతుడికి ఇష్టమైన పూలతో ఆయనని సేవించడం వలన భూత ప్రేత పిశాచ బాధలు … గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోవడమే కాకుండా, ఆయురారోగ్యాలు … అష్టైశ్వర్యాలు … విజయాలు చేకూరుతాయి.