తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగుతున్నాయి. ఈ సందర్భంగా ఐదోరోజు వాహనసేవల వివరాలు తెలుసుకుందాం…
మోహినీ అవతారం:బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిచ్చారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో దర్శనమిచ్చాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తన భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో స్వామి ప్రకటిస్తున్నారు.
గరుడ వాహనం: ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమహావిష్ణువు తన దివ్యమంగళ రూపాన్ని దర్శించే అవకాశం కల్పిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామి తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటికి తెలియజెప్పడమే ఈ వాహనసేవ అంతరార్థం.