పెళ్లికి ముందు వాడుకొని వదిలేశాడని.. అమ్మాయి ఏం చేసిందంటే

నల్లగొండ జిల్లా చెర్వుగట్టు గుట్ట కాడ వారికి పరిచయం అయింది. ఆ పరిచయంతో ఫోన్లు, చాటింగ్ లు, మెసేజ్ లకు దారి తీసింది. అమ్మాయిని ఓ మధ్యవర్తి ద్వారా పిలిపించుకొని థమ్సప్ ల మత్తు మందు కలిపి ఇచ్చారు.  ఆ తర్వాత ఆమె గదిలోకి వెళ్లిన ఆ యువకుడు శారీరకంగా అనుభవించాడు. మత్తులో నుంచి తేరుకున్నాక ఆ యువతి నిలదీయగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా వారిద్దరి మధ్య బంధం కొనసాగింది. చివరకు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం కావడంతో చేసేదేం లేక ఆ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, అసలు వివరాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. 

సూర్యాపేట జిల్లా పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన కక్కిరేణి సత్తయ్య కుమార్తె ఉమారాణి. డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ లో ఓ చిన్న ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉమారాణి చెర్వుగట్టు గుట్టకు వెళ్లింది. అక్కడ జయ అనే మహిళ తన కుటుంబంతో కలిసి వచ్చింది. గుట్ట దగ్గర ఆ రోజు రాత్రి నిద్ర చేసిన జయ, ఉమారాణి దోస్తులకు మంచి పరిచయం ఏర్పడింది.

జయ వెంట వాళ్ల అక్క కొడుకు శ్రీకాంత్ కూడా వచ్చాడు. అప్పుడే ఆ అమ్మాయిని చూసి చిన్నమ్మ ద్వారా ఉమారాణి నంబర్ తీసుకున్నాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. శ్రీకాంత్ చండూరు ఎస్ బీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనిది దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం.  ఇదంతా 2016 లో జరిగింది. 

2016 లో తాళ్ల వీరప్పగూడెంలోని శ్రీకాంత్ ఇంటికి ఉమారాణిని జయ రప్పించింది. ఆమె రాగానే థమ్సప్ ఇచ్చారు. అందులో మత్తు మందు కలపడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఉమారాణి ఉన్న గదిలోకి శ్రీకాంత్ వెళ్లి శారీరకంగా అనుభవించాడు. మత్తు నుంచి తేరుకున్న ఉమా అసలు విషయం తెలుసుకొని జయ, శ్రీకాంత్ లను నిలదీసింది. ఇద్దరిది  ఒకే కులం కావడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శ్రీకాంత్ కూడా బ్యాంక్ ఉద్యోగి కావడం, ఒకే కులం కావడంతో ఉమ కూడా ఒప్పుకుంది.

అలా 2016 నుంచి వారు అప్పుడప్పుడు కలుస్తూ తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. చెల్లెలి పెళ్లి కాగానే పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్ నమ్మించడంతో ఉమా కూడా తనకు వచ్చిన సంబంధాలను చెడగొట్టుకుంటూ వస్తుంది. ఇటీవల శ్రీకాంత్ చెల్లెలికి పెళ్లి అయ్యింది. ఆ తర్వాత వెంటనే మేన మరదలితో శ్రీకాంత్ కు పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ విషయాన్ని జయ ఉమారాణికి ఫోన్ చేసి చెప్పింది.  వెంటనే ఉమారాణి శ్రీకాంత్ కు ఫోన్ చేయగా అతను ఎత్తలేదు.

దీంతో ఉమా సూర్యాపేట డిఎస్పీని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. డిఎస్పీ నాగేశ్వరరావు శ్రీకాంత్ ను పిలిచి మాట్లాడాడు. 15 రోజుల్లోగా పెద్ద మనుషులలో మాట్లాడుకోవాలని అప్పటికి తేలక పోతే కేసు నమోదు చేస్తానని డిఎస్పీ శ్రీకాంత్ ను హెచ్చరించాడు. అంతే కాకుండా సంఘటన దామరచర్ల పరిధిలో జరిగింది కాబట్టి సూర్యాపేటలో తాము కేసు పెట్టలేమని చెప్పారు.

15 రోజులు దాటిన శ్రీకాంత్ నుంచి కానీ అతని పెద్దల నుంచి కానీ స్పందన లేకపోవడంతో ఉమారాణి సూర్యాపేట ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఆ సమయంలో ఎస్పీ ఇతరులతో సమావేశంలో ఉండడంతో ఆమెను కలవలేకపోయాడు. వేచి  చూసిన ఉమారాణి ఎస్పీ ఆఫీసు ముందే తన వెంట తెచ్చుకున్న పురుగుల  మందు తాగింది.  ఆమె వెంట వచ్చిన కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది ఉమారాణిని హూటాహూటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉమారాణి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

దామరచర్ల పరిధిలో ఉమారాణి పై అత్యాచారయత్నం జరిగింది కాబట్టి అక్కడి స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారని పోలీసులు తెలిపారు. దామరచర్ల నల్లగొండ జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడి ఎస్పీని కలిసి సమస్య చెప్తే పరిష్కరిస్తారని పోలీసులు కుటుంబ సభ్యలకు చెప్పారు.

గుట్ట కాడ అయిన పరిచయం ఇంతదాక దారితీసేంత వరకు తమకు తెలియదని ఉమారాణి కుటుంబ సభ్యులు తెలిపారు. తాను చదువుకుంటానని కొన్నాళ్లు అయ్యాక పెళ్లి చేసుకుంటానని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టిందన్నారు. శ్రీకాంత్ తమ కూతురును పెళ్లి చేసుకొని న్యాయం చేయాలని లేని పక్షంలో తమ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని ఉమారాణి తల్లిదండ్రులు హెచ్చరించారు.