సర్పంచ్ అభ్యర్ధి ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పంతానికి పోయి భార్య పోటి చేయడం లేదని భర్త, భర్త పోటి చేయడం లేదని భార్య ఇలా ఆలుమగల మధ్య లొల్లి కావడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తనని ఏకగ్రీవ సర్పంచ్ గా ఎంపిక చేస్తామని ప్రకటించి మరొకరిని బరిలోకి దింపడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ పంచాయతీకి మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన అంగిడి రాధను బరిలోకి దింపాలని టిఆర్ఎస్ మద్దతు దారులు, పార్టీ కార్యకర్తలు నిర్ణయించారు. దీనికి రాధ కూడా ఒప్పుకుంది. రాధను ఏకగ్రీవం చేయాలని కుల సంఘాలు కూడా తీర్మానించాయి.

నామినేషన్ సమయంలో అదే సామాజికి వర్గానికి చెందిన మరో మహిళతో నామినేషన్ వేయించారు. విషయం తెలుసుకున్న రాధ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లింది. అయినా కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు రాధకు బదులు మరో అభ్యర్ధికి మద్దతుగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో రాధ మనస్తాపానికి గురయ్యింది.  ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి రాధ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను జమ్మికుంటలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.