రోజు రోజుకు వివాహేతర సంబంధాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. అసలు వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డికి రజనీతో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కి జెసిబిలు, ట్రాక్టర్లు ఉన్నాయి. దీంతో తన వ్యాపార నిమిత్తం కంభం పట్టణానికి మకాం మార్చాడు. కంభం పట్టణంలో ఓ ఇల్లు కిరాయి తీసుకొని కుటుంబంతో సహా ఉంటున్నాడు. రజనీకి మరియు పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు పట్టణంలోని వెంకటరమణ మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ కు తీసుకు వెళ్లేవారు. అందులో డాక్టర్ పేరు ఉలవల వెంకట నారాయణ.
రజనీ కాస్త అందంగా ఉండడంతో డాక్టర్ వెంకట నారాయణ కన్ను రజనీ పై పడింది. రజనీకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రజనీ భర్త జగన్మోహన్ రెడ్డి నిత్యం వ్యాపార పని నిమిత్తం బయటికి వెళ్లేవాడు. అలా వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. జగన్ మరియు పిల్లలు లేనప్పుడు నారాయణ ఏకంగా ఇంటికి వచ్చేవాడు. అప్పుడప్పుడు క్లినిక్ లోనే వీరి సరసాలు సాగేవి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. దీంతో జగన్ రజనిని హెచ్చరించాడు. మంచిగా ఉండాలని కోరాడు. అయితే ఈ విషయం రజనీ నారాయణకు చెప్పింది. దీంతో జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలని నారాయణ ప్లాన్ వేశాడు.
నారాయణ జగన్మోహన్ రెడ్డిని చంపేందుకు తమ బంధువైన రావూరి చలమయ్యను సంప్రదించాడు. అతను కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. జనవరి 29 న రాత్రి 10 గంటలకు జగన్ ఇంటికి చలమయ్య వచ్చాడు. తాను మీ మధ్య ఏర్పడ్డ పంచాయతీని పరిష్కరిస్తానని మాట్లాడుదాం అంటూ పిలిచాడు. రజనీ కూడా తన తప్పేంటో చెప్పాలని వెళ్లి రా అని అంది. దీంతో నిజమనే నమ్మిన జగన్ చలమయ్యతో పాటుగా కారులో వెళ్లాడు. కారులో కొంచెం దూరం పోయాక ప్లాన్ ప్రకారం నారాయణతో పాటు మరో ఇద్దరు ఎక్కారు. నారాయణ జగన్మోహన్ రెడ్డికి మత్తు మందిచ్చాడు. ఆ తర్వాత నలుగురు కలిసి గొంతు పిసికి చంపారు.
మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశ్యంతో నల్లమల అటవీ ప్రాంతంలోని రోళ్లపెంట వద్ద లోయలో పడేశారు. అక్కడ చెట్టుకు తగిలి జగన్ బాడీ 50 అడుగుల లోతులో పడకుండా మీదనే ఉంది. ఆ తర్వాత అంతా వెళ్లిపోయారు. జగన్మోహన్ తండ్రికి రజిని ఫోన్ చేసి మీ అబ్బాయి కనిపించడం లేదని చెప్పింది. దీంతో ఆయన అక్కడకు చేరుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు తీవ్రంగా శ్రమించగా అడవిలో జగన్మోహన్ బాడీ దొరికింది. ఆ సమయంలో రజిని అక్కడే ఉంది. భర్త చనిపోయాడన్న పీకరు లేకుండా నవ్వుతూ కనిపించింది. దీంతో రజిని పై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో అందరిని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్ కు తరలించారు. జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో శనివారం ముగిశాయి. ఎంతో సౌమ్యునిగా పేరున్న జగన్మోహన్ రెడ్డి హత్యకు గురికావడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. తల్లి జైలుకు, తండ్రి చనిపోవడంతో ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.