కామాంధులు కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. చాక్లెట్ల ఆశ చూపి ఒకరు, డబ్బు ఆశచూపి ఇంకొకరు దారుణాలకు పాల్పడుతున్నారు. మరీ దారుణమైన విషయమేమిటంటే పెళ్లె పిల్లలు ఉన్నవారే ఇటువంటి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ బాలికను లోబర్చుకొని గర్భవతిని చేశాడో ప్రబుద్దుడు అసలు విషయం బయటకు పొక్కడంతో ఆ బాలిక శీలానికి వెలకట్టాడు. పెద్ద మనుషుల్లా చలామణి అయ్యే కొందరు దీనికి వంతపాడటం సిగ్గుచేటైన విషయమని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఇంతకీ ఈ సంఘటన విషయాలేంటో మీరూ చదవండి.
చెట్టు కింద పంచాయతీ తీర్మానం చేస్తున్న పెద్దలు
మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటకు చెందిన బాలిక(17) తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆ బాలిక కూలి పనులకు వెళ్లేది. పత్తిచేను పనికి వెళ్లగా మల్దకల్ మండలానికి చెందిన పత్తిచేను యజమాని వెంకటయ్య బాలికను లోబర్చుకున్నాడు. కుమార్తెలో వచ్చిన శారీరక మార్పులు గమనించిన బాలిక తల్లి వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. బాలికను తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పింది. వెంకటయ్యను బాలిక తల్లిదండ్రులు పని ఉందంటూ పిలిచి ఇంట్లో నిర్భంధించారు. విషయం బయటకు తెలియడంతో గ్రామ పెద్దలు బుధవారం పంచాయతీ పెట్టి రూ.2.10 లక్షలను నష్టపరిహారంగా బాలిక కుటుంబానికి ఇచ్చేలా తీర్మానం చేశారు. బాలిక కుటుంబం విన్నపం మేరకు వెంకటయ్యను గ్రామ బహిష్కరణ చేశారు. వెంకటయ్యకు గతంలోనే బాధితురాలి కుటుంబం దేహశుద్ది చేసినట్టు తెలుస్తోంది. వెంకటయ్య ఇది వరకు కూడా ఇద్దరు బాలికలను లోబర్చుకున్నాడని గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది.
సాంకేతికత మారినా మనుషుల మనసులు అయితే మారడం లేదు. ఆర్ధిక పరిస్థితులను ఆసరాగా చేసుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.