మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కోయిల్ కొండ మండలం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. నారాయణ పేట జిల్లాను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే నారాయణ పేట జిల్లాలో కోయిల్ కొండ మండలాన్ని కలుపుతున్నారు. దీంతో కోయిల్ కొండ మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంచాలని ఆందోళన నిర్వహించారు. గత కొన్ని రోజులుగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతూ ఉద్యమిస్తున్నారు.
సోమవారం అన్ని గ్రామాల ప్రజలు కలిసి దమ్మాయిపల్లి వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. దీంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు వినలేదు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ సమయంలో కొంతమంది ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు విసిరారు. దీంతో సీఐ పాండురంగారెడ్డికి గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు ఆందోళనకారుల పై లాఠీ ఛార్జీ చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్పీ రమా రాజేశ్వరి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ అదనపు బలగాలు మోహరించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.
ఆందోళన వీడియో కింద ఉంది చూడండి.