టీవీ ఛానల్ రిపోర్టర్ ఆత్మహత్యా ప్రయత్నం..పోలీస్ ల ఒత్తిడే కారణం?
హైదరాబాద్ లోని ఓ టీవీ ఛానెల్ సంభందించిన రిపోర్టర్ ఆత్మహత్యా ప్రయత్నం చేయటం మీడియా వర్గాల్లో సంచనలం రేపుతోంది. ఓ షాప్ వద్ద జరిగిన గొడవకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేకున్నా హైదరాబాద్ బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ స్టేషన్‌కు పిలిచి అవమానించారని మనస్తాపానికి గురైన సదరు రిపోర్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అందుతున్న సమాచారం మేరకు.. మల్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్ ఓ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఓ దుకాణంలో జరిగిన గొడవకు తనకు సంబంధం ఉందని, అతన్ని అవమానపరుస్తూ పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టినట్లు ఆయన తెలిపాడు. గొడవతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినా ఇన్‌స్పెక్టర్ సైదులు వినిపించుకోకుండా అనుమానం వ్యక్తం చేస్తూ కించపరిచారని వాపోయాడు. పోలీసులు అవమానించారంటూ మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియోను వాట్సాప్‌లో పెట్టాడు.
అనంతరం ట్యాంక్ పైకెక్కి పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఐసీయూలో ఉన్నట్లు భార్య లావణ్య తెలిపారు. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా గొడవలో అతని పాత్ర ఉందని తెలియడంతో పిలిచి సమాచారం అడిగి పంపించామని, అవమానించలేదని వివరించారు.