భార్య మాటను నిరాకరించిన భర్త..మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన భార్య…!

ప్రస్తుత కాలంలో దేశంలో రోజురోజుకు ఆత్మహత్యలు చేసుకుని వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలవల్ల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా మనస్థాపం చెంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. భార్య చెప్పిన మాటను భర్త నిరాకరించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే… మురళీ కృష్ణ – తులసి దుర్గ అనే దంపతులు కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలంలో నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన సమయంలో నుండి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తులసి దుర్గకి మహిళా వాలంటీర్ గా ఉద్యోగం వచ్చింది. ఏసుక్రీస్తును నమ్మె తులసి దుర్గ ప్రతి ఆదివారం దైవ ప్రార్థన కోసం చర్చికి వెళ్ళేది. ఈ క్రమంలో ఈ ఆదివారం రోజు కూడా తులసి దుర్గ చర్చికి వెళ్లడానికి సిద్ధమయ్యింది. తనతో పాటు తన భర్తని కూడా చర్చికి రమ్మని బ్రతిమలాడింది. అయితే మురళీ కృష్ణ మాత్రం చర్చ్ కి వెళ్ళటానికి నిరాకరించి తులసిని చర్చ్ కి వెళ్ళమని చెప్పాడు.

అయితే మురళీకృష్ణ చర్చ్ కి రావడానికి నిరాకరించటంతో తులసి మనస్థాపం చెంది మీరు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని భర్తను బెదిరించింది. మురళీకృష్ణ తులసి మాటలను తేలికగా తీసుకొని అలాంటి పనులు చేయదని అనుకున్నాడు. కానీ తన మాటలు నమ్మకపోవటంతో తులసి బైక్ మీద పాశర్లపూడి బ్రిడ్జి దగ్గరకు వచ్చింది. ఆవేశంతో బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఏపీ టూరిజం సిబ్బంది ప్రాణాలకు తెగించి తులసీని ఒడ్డుకు తీసుకువచ్చారు.

కానీ నీటిలో మునగడం వల్ల తులసి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే వారు తులసిని ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. చర్చికి వెళ్లడానికి నిరాకరించినందుకు తన భార్య ఇంత పని చేస్తుందని మురళీకృష్ణ అస్సలు ఊహించలేదనీ.. ఆమె మృతదేహంపై పడి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే తులసి ఆత్మహత్య చేసుకోవటానికి మురళీకృష్ణ చర్చికి రాకపోవడం వల్ల వచ్చిన మనస్థాపమా? లేక మరేదైనా కారణం ఉండొచ్చా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.