టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ నల్లా కనెక్షన్ కట్

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటూ బకాయిలు చెల్లించని వారిపై అధికారులు కొరడా ఝళ్లిపిస్తున్నారు. ప్రస్తుత టిఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాబు మోహన్ కు అధికారులు షాక్ ఇచ్చారు. నల్లా బిల్లు చెల్లించనందుకు ఆయన ఇంటికి ఉన్న నల్లా కనెక్షన్ ను అధికారులు కట్ చేశారు.

ఈ విషయమై జీహెచ్ ఎంసీ వాటర్ వర్క్స్ విభాగం సీనియర్ అధికారి స్పందించారు. బాబు మోహన్ తన ఇంటికి ఉన్న నల్లా కనెక్షన్ కు సంబంధించి రూ. 4 లక్షలు బకాయి ఉన్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని పలుమార్లు నోటిసులు పంపినా ఆయన స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని వెల్లడించారు. బాబు మోహన్ తో పాటు సినీ నటుడు మాదాల రవికి అధికారులు ఝలక్ ఇచ్చారు. ఇప్పటి వరకు నల్లా బిల్లులు 3 లక్షల రూపాయలు దాటినా చెల్లించకపోవడంతో ఆయన ఇంటి వాటర్ సప్లైని అధికారులు నిలిపేశారు.

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా బిల్లులు కట్టకుండా ఉంటే ఎలా అని పలువురు చర్చించుకుంటున్నారు. పేదవాడు ఒక నెల బిల్లు చెల్లించకుంటేనే బజారుకీడుస్తారు ప్రజాప్రతినిధులవి లక్షల్లో బిల్లులు పేరుకుపోయే దాకా ఏం చేశారని విపక్షాలు విమర్శించాయి. సినీ నటుడిగా మంచి పేరున్న బాబు మోహన్ బిల్లు చెల్లించకుండా ఉండటంపై అంతా చర్చగా మారింది.