తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి వాన నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు వానలకు రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి అటుగా వెళ్లే వాహనదారులకు నరకయాతన పడుతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి గుంతలు రోడ్లు చూసిన ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా రోడ్డుపై ఉన్న గుంతల్ని పూడ్చి పెట్టారు.
మహబూబాబాద్ మండలంలోని మాల్యాల గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. బేథోల్ మీదుగా వెళ్తున్నారు. అయితే అక్కడ రోడ్డు బురదమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చూసిన ఎమ్మెల్యే రోడ్డు మరమ్మతులకు నడుం బిగించారు. వెంటనే రెండు టిప్పర్ల డస్ట్ను తెప్పించారు. బురదతో పేరుకుపోయిన రోడ్డుపై డస్ట్ పోయించారు. అక్కడ మరమ్మతులు చేపట్టారు. ఎమ్మెల్యేనే స్వయంగా పార చేతపట్టి పనిలో నిమగ్నమయ్యారు. గుంతలను పూడ్చారు. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టినందుకు ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.