టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక అడుగు దిగొచ్చి తాను చేసి న వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి కావని వివరణ ఇచ్చారు. ఒకవేళ ఎవరి మనసునైనా నొప్పిస్తే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నానని ధర్మారెడ్డి తెలిపారు. అంతకుముందు రెండు రోజుల క్రితం హన్మకొండలో ఓసీ జేఏసీ సభలో మాట్లాడిన ధర్మారెడ్డి.. ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చూసినా వాళ్లే ఉన్నారని… మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారని అన్నారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. అనేక చోట్ల ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగొచ్చిన ధర్మారెడ్డి.. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని కామెంట్ చేశారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బిసి,దళిత వర్గాల ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతీసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మారెడ్డి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అభిశంసన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బడుగు బలహీన వర్గాల పై ప్రేమ ఉంటే ఎమ్మెల్యేను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇక కొద్దిరోజుల క్రితమే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అయోధ్య రామాలయ నిర్మాణం కోసం వసూలు చేస్తున్న విరాళాలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరిట బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారుచేసి చందాలు వసూలు చేస్తున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఆయన కార్యాలయంపై దాడి కూడా చేసింది. దీనిపై వివాదం సద్దుమణగకముందే ధర్మారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.