ఒకరు కాదు, ఇద్దరు కాదు.. పది మందీ కాదు.. ఇరవై మందీ కాదు.. ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పబోతున్నారట. ఇది నిజమేనా.? నిజమే అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక పెను ప్రకంపనే అవుతుంది. భారతీయ జనతా పార్టీ, తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం విదితమే. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల కోసం ప్రత్యక్షంగా కేంద్ర హోంమంత్రి, పరోక్ష:గా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారంటేనే పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోంది. ‘పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నాం..’ అని బీజేపీ గట్టిగా నినదించగలిగిందంటే, తెలంగాణపై బీజేపీకి ఏ స్థాయిలో పట్టు లభించి వుండొచ్చో అర్థం చేసుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి.. సంచలన వ్యాఖ్యలు చేయడమే కాదు, తాను మాట్లాడే ప్రతి మాటా నిజం.. అనేలా సత్తా చాటుతోన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈసారి 30 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు. వాళ్ళంతా మాతో టచ్‌లో వున్నారంటూ బండి సంజయ్ ప్రకటించడంతో ఒక్కసారిగా గులాబీ పార్టీలో ప్రకంపనలు బయల్దేరాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని గతంలో వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు సమర్థిస్తున్నారు. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో బీజేపీ పట్ల కొంత సానుకూలతతో వ్యవహరిస్తున్నారు కేసీఆర్.
ఇదంతా, కేసీఆర్‌లో ‘గ్రేటర్ ఎన్నికలు’ తెచ్చిన మార్పుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్న వేళ, టీఆర్‌ఎస్‌ని కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు బండి సంజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. ‘బీజేపీతో కేసీఆర్ కలవాలనుకున్నా, అది జరిగే పని కాదు. తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్‌ని తరిమేస్తాం..’ అంటున్నారు బండి సంజయ్. అది సాధ్యమేనా.? అంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఇంతలా మారిపోతాయని ఎవరూ ఊహించలేదు. ఒక్క కదలిక టీఆర్‌ఎస్ కాస్త గట్టిగా చోటు చేసుకుందంటే, బీజేపీ వైపు వెళ్ళే టీఆర్‌ఎస్ నేతల్ని ఆపడం ఎవరి తరమూ కాకపోవచ్చు. ఆ ‘పెద్ద తలకాయ్’ మీద ఇప్పటికే బీజేపీ తెలంగాణ నాయకత్వం అలాగే బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.