హరీష్ రావు మళ్లీ భావోద్వేగం, షాకింగ్ కామెంట్స్

సిద్దిపేట రూరల్ మండలం హరీష్ రావు  దత్తత గ్రామం, ఆదర్శ గ్రామమైన ఇబ్రహీం పూర్ ను  15 రాష్ట్రాల కు చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మేల్సీలు మరియు 25 మంది ఐఏఎస్ లు గురువారం పర్యటించారు. వారికి  ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు హరీష్ రావు. బతుకమ్మ చీరెల పంపిణీ సందర్భంగా హరీష్ రావు భావోద్వేగానికి లోనయ్యారు,  ఎన్నికల ముందు కూడా హరీష్ రావు ప్రజల ప్రేమ, అభిమానం ఉన్నప్పుడే రాజకీయాలనుంచి తప్పుకోవాలనిపిస్తున్నదని భావోద్వేగంగా మాట్లాడారు. తాజాగా మరోసారి హరీష్ నోట అటువంటి మాటలే రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే హరీష్ రావు భావోద్వేగ ప్రసంగంలో ఏమన్నారో చదవండి.

‘‘అన్నింటిలో ఆదర్శం ఇబ్రహీం పూర్ గ్రామం. ఓట్లు వేయడం లో కూడా ఆదర్శంగా ఉన్నారు.  97.6 శాతం ఓట్లు వేసి జిల్లా లో మొదటి స్థానంలో నిలిచారు. పోలైన ఓట్లలో అత్యధిక శాతం టీఆర్ఎస్ కు వేసిన మొదటి గ్రామం కూడా ఇబ్రహీంపూరే. నా ఊపిరి ఉన్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటా. నాకంటే ఐశ్వర్యవంతులు ఎవరూ ఉండరు. ప్రేమ అభిమానం మించిన ఐశ్వర్యం మరోటి లేదు. ఎన్ని కోట్లు ఉన్నా ప్రేమ అభిమానం కొనలేము. మీకు మరింత సేవ చేస్తా.’’

వివిధ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ఇబ్రహింపూర్ పర్యటనకు వచ్చిన సమయంలో హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఏమన్నారంటే… ఇబ్రహీం పూర్ ప్రజలు చాలా అదృష్టవంతులు. మన దగ్గర చేసిన మంచి పనులను నేర్చుకోవడానికి దేశం నలుమూలల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు వచ్చారు. ఇది ఇబ్రహీం పూర్ ప్రజల గొప్పతనం. ఇది స్పూర్తిదాయకం, ఇంకా చాలా చేయాలి. భవిష్యత్తులో ఇంకా కలిసి మెలిసి ఉంటూ గ్రామాన్ని ఆదర్శంగా మార్చుకోవాలి.

హ్యాట్సాఫ్ హరీష్ బయ్యా …

ఇబ్రహీంపూర్ పర్యటనకు వచ్చిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ హరీష్ రావును అభినందించారు. ఇబ్రహింపూర్ గ్రామాన్ని చూసి వారంతా ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావును మెచ్చుకొని ముగ్దులయయారు. మాకు హరీష్ బాయ్ ఆదర్శ నాయకుడు… ఆయనను ఆదర్శంగా తీసుకుంటాం… గ్రామ ప్రజల ముఖం లోనే గ్రామ అభివృద్ధి కనపడుతుంది… అని వారు వ్యాఖ్యానించారు. 

మూడు గంటల పాటు గ్రామాలో అభివృద్ధి పనులను పరిశీలించింది ఎమ్మెల్యే ల బృందం. అభివృద్ధి పనితీరు, ప్రజల ఐక్యత ను దగ్గరుండి చూపించారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇలాంటి గ్రామానికి రావడం మాకు సంతోషంగా ఉందని వారు వివరించారు. ఈ సందర్భంగా ఇబ్రహింపూర్ పర్యటనకు వచ్చిన 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హరీష్ రావు సన్మానించారు. సిద్ధిపేట ప్రత్యేకత అయిన కాపు రాజయ్య పెయింటింగ్స్ మేమేంటోస్, గొల్ల భామ చీరలను వారికి బహుకరించారు హరీష్ రావు. 

ఇబ్రహింపూర్ లో ఎమ్మెల్యేలు విజిట్ చేసిన ఫొటో గ్యాలరీ కింద ఉంది చూడొచ్చు.