తొందర్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్త ఉద్యమం చేపట్టబోతున్నారు.నియోజవర్గంలోని ప్రజలందరిని భాగస్వాములనుచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆకుపచ్చ నియోజకవర్గంగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు ఆయన పౌర సమస్యల మీద రెండు పెద్ద యాత్రలు చెపట్టారు. ఇందులో ఒకటి , మన ఇంటికిమన ఎమ్మెల్యే. ఈ యాత్రంలో ఆయన తన ఇల్లొదిరి నియోకవర్గంలోని ప్రజలలో ఇల్లలోనే ఉంటూ వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. ఇపుడాయన రెండో యాత్ర 366 రోజుల ప్రజాప్రస్థానంలో ఉన్నారు. ఈ యాత్రలో అనేక చోట్ల మాయమై పోయిన చెట్లను చూసి చెట్లు నాటే ఉద్యమాన్ని ప్రజాఉద్యమంలాగా జరపాలని నిర్ణయించారు. అందుకే ఆయన ప్రజలతో మొక్కలు నాటే ఉద్యమం, నిజాయితీగా చెేపట్టి, ప్రతిమొక్క బతికి పెద్దదై వూరికి అండగా నిలబడేలా ఉద్యమం నడపాలని నిర్ణయించారు.
ఆయన ఇపుడు సాగిస్తున్న 366 రోజుల ప్రజా ప్రస్థానం భాగంగా ఆయన ఈ రోజు 28వ డివిజన్, గాయత్రి నగర్ లో పర్యటించారు. స్థానిక ప్రజలతో స్థానిక సమస్యలపై ఆరాతీస్తూ, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరిస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అద్వాన్నపు డ్రైన్ లతో తాము పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వివరించారు.
అన్ని కంటే ముఖ్యంగా వేలాది చెట్లుమాయమయిన విషయాన్ని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చి ఆశ్చర్య పరిచారు. చెట్ల పెంపకంపై ఉపన్యాసాలిస్తూ, వేల చెట్లు నాటబోతున్నామని ప్రకటనలు చేస్తున్న నాయకులు, ఉన్న చెట్లను కాపాడేదానికి చర్యలు తీసుకోవడం లేదని వారు తమ ఎమ్మెల్యేకి వివరించారు. ప్రజల ఫిర్యాదుతో ఆయన ఏకీభవించారు.చెట్లు నాటడాన్ని పండగలా చేసుకుని చప్పట్టుకొట్టుకుని సంతోషపడి పోతున్నారని, ఈ చెట్లేమవుతున్నాయో పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు.
అవన్నీ ప్రభుత్వం వారి ఫోటో మొక్కలని అందుకే నిర్లక్ష్యం గురయి చనిపోతున్నాయని ఆయన అన్నారు.
‘గత నాలుగేళ్ళుగా నగరంలో వేల చెట్లు నాటారు. ఇప్పుడు వెతుకుదామన్నా కనపడడం లేదు. చెట్లు నాటి, ఫోటోలు తీయించుకొని, మాటలు చెప్పడం మాత్రం జరుగుతున్నది. చెట్లు నాటి వాటి పెంపకానికి నీళ్ళు పోసి, చుట్టూ ట్రీ గార్డులు పెట్టి పరిరక్షిస్తేనే చెట్టు బతికి మన అండగా ఉంటుంది. నెల్లూరు చుట్టు ప్రక్కల పవర్ ప్లాంట్లు పెరిగిపోయాయి. వాటి కాలుష్యం నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే చెట్లపెంపకం తప్పనిసరి. కాని, అది తూతూ మంత్రంగా జరుగుతూ ఉంది. అలా కాకుండా ఒక ప్రజా ఉద్యమంలా సాగాలి. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసి, చెట్ల పెంపకంలో ప్రజలను భాగస్వామ్యులను చెయ్యాలి,’ అని ఆయన అన్నారు.
‘త్వరలో చెట్ల పెంపకాన్ని ఒక ప్రజా ఉద్యమంగా ప్రజల సహకారంతో, రాజకీయ పార్టీలకు అతీతంగా చేపట్టేదానికి ఆలోచన చేస్తున్నాను, నగర కార్పొరేషన్ సహకరిస్తే, రాష్ట్రంలోనే చెట్ల పెంపకంలో నెల్లూరు ఆదర్శంగా నిలిచే విధంగా తాను బాధ్యత తీసుకుంటాను,’ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట 28 డివిజన్ ఇన్ చార్జ్ భీమినేని మురహరి తదితరులు పాల్గొన్నారు.