నెల్లూరు రూరల్ వైసిపి ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర రెడ్డి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజా సమస్యలంటే పరిష్కారానికి ముందుంటారు. పరిష్కారం కాకపోతే ఉద్యమాలంటారు, ఆందోళనలు, నిరసనల పేరుతో జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోతారు. అందుకనే కోటంరెడ్డి అంటే అధికారులకు ఒకింత భయమే. ఈరోజు కోటంరెడ్డి చేసిందదే. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఓ సమస్యపై ఎంఎల్ఏ వినూత్నంగా నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారుల వైఖరికి నిర్లక్ష్యంగా ఎంఎల్ఏ ఎవరూ ఊహించని రీతిలో మురిక్కాలువలోకి దిగి నిలబడ్డారు. జరిగిన విషయం తెలుసుకున్న అధికారులు ఉరుకులు పరుగులతో ఎంఎల్ఏ దగ్గరకు వచ్చేశారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, తన నియోజకవర్గం పరిధిలోని ఓ మురికి కాలువపై వంతెన లేకపోవటంతో స్ధానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణం కోసం జనాలు ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఉపయోగం కనబడలేదు. దాంతో విషయం ఎంఎల్ఏ దృష్టికి వచ్చింది. కోటంరెడ్డి జోక్యం చేసుకున్న తర్వాత కూడా అధికారులు లెక్క చేయలేదు. దాంతో ఇక లాభం లేదని అర్ధం చేసుకున్న ఎంఎల్ఏ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు హఠాత్తుగా మురికికాల్వలోకి దిగి నిలబడ్డారు.
ఎంఎల్ఏ ప్రయత్నాన్ని గమనించిన స్ధానికులు, మద్దతుదారులు కాలువలోకి దిగవద్దని చెప్పారు. అయినా ఎంఎల్ఏ వినలేదు. అధికారులు వచ్చి సమస్య పరిష్కారం చేసేంత వరకూ తాను బయటకు వచ్చేది లేదని చెప్పిన ఎంఎల్ఏ కాలువలోకి నడుంలోతు వరకూ దిగి చేతులు కట్టుకుని నిలబడ్డారు. గట్టిగా చెప్పారు. ఎంఎల్ఏ కాలువలోకి ఎప్పుడైతే దిగారో ఆయనతో పాటు కొందరు మద్దతుదారులు కూడా కాలులోకి దిగేశారు. జరుగుతున్న విషయం గమనించిన స్ధానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. దాంతో విషయం ఉన్నతాధికారుల వరకూ చేరింది. వెంటనే మున్సిపల్ అధికారులు భయపడిపోయి ఎంఎల్ఏ దగ్గరకు పరుగులు పెట్టి హామీ ఇచ్చారు.