ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు, తీరు మారకుంటే తగలబెడతా

నెల్లూరు  రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోపం రావడం అరుదు. వస్తే భూకంపమే.

ఈ రోజదే జరిగింది. కోటం రెడ్డి కి నిజంగా కోపం వచ్చింది. ఆగ్రహోదగ్రుడయ్యాడు. అధికారులను, కాంట్రాక్టర్లను తీరు  మార్చుకోండని హెచ్చించాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాటం మానుకోండని చెప్పాడు. తీరు మారకుంటే, కాంట్రాక్టర్ల కార్యాలయాలను తగలబెడగానని హచ్చరించాడు.

ఆయన ఇలాంటి కఠిన పదజాలం వాడటం  ఇదేప్రథమం కావచ్చు. దీనికి సరైన కారణం ఉంది.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర హెచ్చరికలతో  అధికారులు, కాంట్రాక్టర్లు పరుగులు పెట్టి రోడ్ల గుంతలు పూడ్చే పనిలో పడ్డారు.

 తాను చేపట్టిన 366 రోజుల ప్రజాప్రస్థానం ఇంటింటి యాత్రలో భాగంగా నేడు కోటంరెడ్డి  18 వ డివిజన్, హరనాధపురంలో పర్యటించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, ప్రజల సూచనలు, సలహాలు వింటూ, స్థానిక సమస్యల గురించి  అక్కడినుంచే నేరుగా అధికారులకు ఫోన్ చేస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా స్థానికులు ఎక్కడికక్కడ గుంతలు తీసి పూడ్చకుండా తాము పడుతున్న తీవ్ర ఇబ్బందుల్ని గుంటల్లో పడి కాళ్ళు, చేతులు విరుగుతున్న ప్రమాదాలను రూరల్ ఎం. ఎల్. ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వివరించారు.

స్పందించిన రూరల్ ఎం. ఎల్. ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, నగరంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పథకం, కాంట్రాక్టర్ల పనులు ఒక పక్క కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాగుతున్న పనులు మరో ప్రక్క వీరి మధ్య సమన్వయము లేక ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారని, అనేక చోట్ల నాసిరకం పనులు జరుగుతున్నాయని, అనేక చోట్ల ఎక్కడికక్కడ గుంతలు తీసి పూడ్చకుండా వదిలేస్తున్నారని మండిపడ్డారు

 మరొకవైపు పనులు జరిగే చోట కనీసపాటి రక్షణ బోర్డులు పెట్టకుండా,హెచ్చరిక బోర్డులు పెట్టకుండా, డివైడర్లు పెట్టకుండా పనులు సాగిస్తున్నారని, దీంతో ప్రజలు ఆ గుంటల్లో పడి కాళ్ళు, చేతులు విరగొట్టుకుంటున్నారని అంటూ ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

వారం రోజుల క్రితం గాంధీనగర్లో ఈ గుంటల్లో పడి రత్నం అనే వ్యక్తి పూర్తిగా కోమాలోకి వెళ్లిన విషయం గుర్తు చేస్తూ , నేటికీ నారాయణ హాస్పిటల్లోనే ఉన్నారని  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.

కాంట్రాక్టర్ల ధనదాహం, అధికారుల నిర్లక్ష్యంతో నగర ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు. తమను ప్రశ్నించే వారు ఎవరు లేరని కాంట్రాక్టర్లు విర్రవీగుతున్నారని, కాసుల కక్కుర్తికి అలవాటుపడిన పాలకులు నోరు లంచాల మత్తులో అధికారులు ఊరుకున్నా, ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా తాను మౌనంగా ఉండేలేనని అన్నారు.

  ప్రజల పక్షాన తాము ఈ విషయంలో ప్రజలు ఫిర్యాదులు చేసిన గంటల్లో స్పందిస్తున్నామని అన్నారు. ధన దాహంతో అల్లాడుతున్న కాంట్రాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పద్ధతులు మార్చుకోకుంటే ఈరోజు నుంచి మరోచోట ఎక్కడైనా ఆ గుంతలతో ఏ ఒక్కరికి ప్రమాదం జరిగిన ఆ కాంట్రాక్టర్ల కార్యాలయాలు తగలబెడతానని రూరల్ ఎం. ఎల్. ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

అవసరమైతే ఆ కాంట్రాక్టర్లను తీసుకువచ్చి ఆ గుంటలలో నిలబెడతానని, కడుపు మండి తానూ ఈ మాటలు మాట్లాడుతున్నానని రూరల్ ఎం. ఎల్. ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరికతో అధికారులు, కాంట్రాక్టర్లు పరుగులు తీశారు. రూరల్ ఎం. ఎల్. ఏ. హెచ్చరికలు జారీ చేసిన గంటలోపే యుద్ధప్రాతిపదికన సిబ్బందిని పిలిపించి గుంతలు పూడ్చేపని ప్రారంభించారు. రూరల్ ఎం. ఎల్. ఏ. పర్యటన అప్పటికే అక్కడ సాగుతూ ఉంది. దీంతో స్థానిక ప్రజలు రూరల్ ఎం. ఎల్. ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అభినందనలు తెలియజేసారు.

నేటి  కార్యక్రమంలో కమతం అశోక్ నాయుడు, కమతం ప్రతాప్ రెడ్డి, పెనాక సుధాకర్ రెడ్డి, మీరామోహిద్దీన్, మళ్ళేం సుధీర్ రెడ్డి, కమతం ప్రతాప్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, శేఖర్, తారిఖ్, అమర్ నాయుడు, వెంకటయ్య, కొల్లి పవన్ కుమార్ రెడ్డి, డా. శంకర్, నరేంద్ర, జనార్దన్ రెడ్డి, నారాయణ రావు, భాష, శేషారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.