నందమూరి హరికృష్ణ మృతికి ప్రధాన కారణం ఇదే

నల్గొండలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతి చెందారు. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన మృతితో కుటుంబంలోనూ, నందమూరి అభిమానుల్లోనూ విషాద చాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్ళడానికి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి నుండి బయలుదేరారు. హరికృష్ణ డ్రైవర్ కంటే ఆయనే స్వయంగా కారు నడపటానికి ఇష్టపడతారు. ఇప్పుడు కూడా ఆయనే స్వయంగా కారు(AP 28 BW 2323) నడుపుతున్నారు. నల్గొండ జిల్లా అనపర్తి సమీపంలో ఆయన కారు డివైడర్ ని ఢీ కొట్టి పల్టీలు కొడుతూ పక్కకి పడిపోయింది. దీంతో హరికృష్ణ కారులోంచి బయట పడ్డారు. తలకి, శరీరానికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి స్థానికులు ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు చికిత్స అందించడానికి ప్రయత్నించినా ఆయన శరీరం వైద్యానికి సహకరించక మృతి చెందారని సమాచారం. అయితే హరికృష్ణ మృతి చెందడానికి ప్రధాన కారణం ఆయన సీట్ బెల్టు పెట్టుకోక పోవడమే అని తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న ఒక అభిమాని కుమారుడివివాహానికి ఆయన హాజరుకావలసి ఉండింది. బుధవారం ఉదయమే ఈ వివాహ ం ఉండటంతో సకాలంలో చేేరుకోవాలని ఆయన స్పీడ్ గా వాహనం నడిపారని చెబుతున్నారు.

ఆయన సీట్ బెల్టు పెట్టుకుని ఉంటే ప్రమాదం జరిగినప్పటికీ, తలకి, గుండె వంటి ముఖ్యమైన అవయవాలకు తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగేది కాదని, అప్పుడు మనిషిని బ్రతికించటానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవని డాక్టర్లు చెబుతున్న మాటలు.

కాగా ఆయన కారు 167 కి మీ మెరుపు వేగంతో నడుపుతున్నట్టు రికార్డు అయింది. అయినప్పటికీ ఆయన సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువ ప్రమాదం జరగకుండా రక్షించేవి. ఆయన ప్రాణాలతో మిగిలేవారు.

నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఏమన్నారంటే…

‘నెల్లూరు జిల్లా కావలిలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు ‘ ఏపీ28 బీడబ్ల్యూ 2323’ నంబర్‌ కారులో ఈ రోజు (బుధవారం) తెల్లవారు జామున 4.30 ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి హరికృష్ణ బయల్దేరారు. కారును హరికృష్ణ స్వయంగా  డ్రైవ్‌ చేస్తున్నారు. అతివేగంగా నడుపుతున్నారు.  హరికృష్ణ కారు అన్నెపర్తి వద్ద అదుపు తప్పి ముందు మారుతి డిజైర్ వాహనాన్ని ఢికొట్టింది. అనంతరం డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టింది. దీంతో హరికృష్ణ కారు గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. హరికృష్ణ దాదాపు 30అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలైన హరికృష్ణను 5నిమిషాల్లో నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో హరికృష్ణ మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగమే ప్రమాదానికి కారణం’ అని నల్గొండ ఎస్పీ రంగనాథ్ మీడియా కు చెప్పారు.