అప్పు తిరిగి చెల్లించమని ప్రశ్నించినందుకు స్నేహబంధం మరిచి హత్య చేసిన కిరాతకుడు!

ప్రస్తుత కాలంలో డబ్బు కోసం ప్రజలు ఎటువంటి అఘాయిత్యాలు చేయడానికి అయినా వెనుకాడటం లేదు. ఈ డబ్బు వల్ల బంధాలు బంధుత్వాలు మరిచిపోయి వారిని చంపడానికే కూడా వెనకాడటం లేదు. కష్టాలలో ఉన్న స్నేహితుడికి వేరొకరితో అప్పు ఇప్పించి ఆదుకున్న పాపానికి ఏకంగా ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే…మహ్మద్ సమీర్ అహ్మద్‌(28) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి గౌతమ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే తన స్నేహితుడైన షేక్ ఇలియాస్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో సమీర్ తనకు తెలిసిన వ్యక్తితో రూ. 50 వేల రూపాయలు అప్పుగా ఇప్పించాడు. మూడు నెలలలో అప్పు తిరిగి చెల్లిస్తానని చెప్పిన ఇలియాస్ ఎన్ని రోజులు గడిచినా కూడా అప్పు చెల్లించలేదు. దీంతో ఈ విషయమై సమీర్ అందరి ముందు ఇలియాస్ ని గట్టిగా ప్రశ్నించాడు. ఇలా అందరి ముందు ప్రశ్నించడంతో ఇలియాస్ అవమానంగా భావించి సమీర్ మీద కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో సమీర్ ని హత్య చేయాలని నిర్ణయించుకొని తన స్నేహితులైన రుస్తుం అలీ, అల్లావుద్దీన్ సహాయం తీసుకుని ఒక వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియల కోసం గుంత తవ్వాలని ఈనెల 8వ తేదీన పటాన్ చేరు శివారులో గుంత తవ్వించాడు. సమీర్ కి కూడా ఈ విషయం చెప్పి అతనిని పిలిపించి అతనితో కూడా గుంత తవ్వించాడు. మరుసటి రోజు ఉదయం సమీర్ కి ఫోన్ చేసి శవం రాలేదని గుంత పొడుస్తున్నట్లు చెప్పి సమీర్ ని అక్కడికి పిలిపించాడు. ఆ సమయంలో ఇలియాస్ గుంత పొడుస్తున్నట్లుగా నటిస్తూ సమీర్ అక్కడికి చేరుకొని అతనికి సహాయం చేస్తున్న సమయంలో ఇనుపరాడితో తలపై కొట్టి అతనిని హత్య చేశాడు.

ఆ తర్వాత సమీర్ తీసిన గుంతలోనే అతనిని పడేసి మట్టితో కప్పి పెట్టాడు. అయితే ఉదయం అనగా ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయం ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవటంతో అతని తల్లిదండ్రులు కంగారుపడి ఇలియాస్ ని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో సమీర్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఇలియాస్ ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తానే సమీర్ ని హత్య చేసినట్లు ఇలియాస్ అంగీకరించాడు. దీంతో పోలీసులు ఇలియాస్ మీద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.