డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో బయటపడ్డ సంచలన నిజాలు

ప్రొఫెసర్ల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డ డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. శిల్పను ముగ్గురు ప్రొఫెసర్లు, మానసికంగా శారీరకంగా వేధించడంతోనే శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని సిట్ నివేదిక తేల్చింది. అసలు వివరాలేంటంటే..

బెల్లంపల్లి శిల్ప. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో పిజి  చేస్తూ రుయా చిన్న పిల్లల ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తుంది. అక్కడ ఉన్న చిన్న పిల్లల హెచ్ వోడి డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ డాక్టర్ కిరిటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శశికుమార్ లు శిల్పను వేధించేవారు. తమ కోరిక తీర్చాలని పలుసార్లు బలవంత పెట్టినట్టు కూడా సిట్ విచారణలో తేలింది. శిల్పకు ఫోన్లు, మెసేజ్ లు చేసి మానసికంగా వేధించేవారని బయటపడింది. వారు ఏ విధంగా ప్రయత్నించినా శిల్ప వారికి లొంగలేదు. శిల్పకు అప్పటికే పెళ్లి కూడా అయ్యింది. అయినా కూడా వారు వేధించారు.

 

వైవా జరుగుతున్నప్పుడు అందరూ ప్రొఫెసర్లు విద్యార్ధులను ప్రశ్నలు అడిగి మార్కులు వేస్తారు. కానీ ఈ ప్రొఫెసర్లు శిల్పను ప్రశ్నించకుండానే పాస్ అయ్యినట్టు మార్కులు వేశారు. అలా ఎందుకు వేశారని శిల్ప ప్రశ్నించినా కూడా ఫెయిల్ చేస్తామని బెదిరించారు. అదేంటి మీరడిగితే నేను సమాధానాలు చెబుతా కానీ ఇలా ఎందుకు చేస్తున్నారని శిల్ప ప్రశ్నించింది.

ప్రయోగ శాలల్లో అందరి ముందే శిల్పను డబుల్ మీనింగ్ లతో మాటలని వేధించడంతో శిల్ప మానసికంగా కుంగిపోయింది. వైద్య విద్యార్దుల ప్రయోగాలు అన్ని దాదాపు శారీరక ప్రమాణాలు కావడంతో పాఠాలు చెప్పేటప్పుడు శిల్ప శరీరంతో పోల్చి ప్రొఫెసర్లు పాఠాలు చెప్పేవారని తేలింది. శిల్ప ఏ రకంగా కూడా లొంగకపోవడంతో పిజి ఫలితాలలో 8 మార్కుల తేడాతో శిల్పను కావాలని ఫెయిల్ చేశారు. రీ వాల్యుయేషన్ పెట్టించినా కూడా శిల్ప పాస్ కాకుండా చేసినట్టు తేలింది.  వీటన్నింటి పై శిల్ప గవర్నర్ కు కూడా లేఖ రాసింది. దీని పై విచారించిన కలెక్టర్ ప్రద్యుమ్న ఓ కమిటిని ఏర్పాటు చేసింది. డాక్టర్ల పై పెట్టిన కేసును శిల్ప ఉపసంహరించుకుంది.

శిల్ప మైగ్రేషన్ సమస్యతో బాధపడేదని, ప్రొఫెసర్ల వేధింపులు కూడా ఎక్కువవ్వడంతో మానసికంగా చాలా కుంగిపోయింది. శిల్ప మైగ్రేషన్ సమస్యకు బెంగుళూరులో చికిత్స తీసుకుంది. ఆ మందు చిట్టిల వివరాలను కూడా సిట్ బృందం పరిగణలోకి తీసుకొని విచారించింది.

శిల్పను మానసికంగా వేధించి, పిజి పరీక్షలలో ఫెయిల్ చేయడంతో తట్టుకోలేక ఆగష్టు 8, 2018 న పీలేరులోని తన స్వంత ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడింది.

శిల్ప ఆత్మహత్యతో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం సిట్ బృందానికి కేసు అప్పగించింది. నిజా నిజాలు తేల్చిన సిట్ బృందం నిందితుల పై కేసు నమోదు చేసింది.  

కీలక ఆధారాలను సేకరించిన సిట్ బృందం పిడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రవికుమార్‌ (ఏ1 నిందితుడు) మృతురాలిని మానసికంగా, అసభ్య మాటలతో వేధింపులకు గురి చేసినట్లు తేల్చారు. ఏ2 ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిరీటి, ఏ3 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శశికుమార్‌ వేధింపులను అడ్డుకోకపోగా ఆయనకు సహకరించారని గుర్తించారు. ముగ్గురు ప్రొఫెసర్లే కారణమని నిర్ధరించారు.

ఇందులో ఏ1పై అండర్‌ సెక్షన్‌ 354(డి), 509, 506, 306ఐసీ ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ, ఎస్‌స్సీ, ఎస్టీ చట్టం కింద కేసులను నమోదు చేయగా, ఏ2, ఏ3లపై 109 ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసును నమోదు చేశారు. నిందితులు ఇప్పటికే హైకోర్టులో బెయిల్‌ పొందారని వారిపై ఒక నెలలో ఛార్జీషీట్‌ దాఖలు చేయనున్నామని సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు.