ఏపీలో దేవాలయాల మీద జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యొక్క మత విశ్వాసాలకు ముడిపెట్టి పెద్ద వివాదమే నడుపుతున్నారు కొందరు. దేవాలయాల మీద దాడులను ఖండించాల్సిన, నిరోధించాల్సిన అవసరం ఉంది కానీ వాటికి జగన్ మతానికి లంకె వేసి రగడ చేయడం సమంజసం కాదు. ఇప్పటికే జరిగిన అనర్థాలతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉన్న తరుణంలో తాజాగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుండే తిరుమల దేవస్థానంలో మొదలైన కొత్త వివాదం మరింత ఉద్రిక్తతకు దారి తీస్తోంది.
తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలో దర్శనం కోసం వచ్చే హిందూయేతర భక్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటన చేశారు. టీటీడీ చట్టాల ప్రకారం ఆలయంలోకి వచ్చే హిందూయేతరులు తమకు స్వామివారి మీద భక్తి, విశ్వాసం ఉన్నాయని ధృవపత్రం మీద సంతకం చేయాలనే నిబంధన ఉంది. కానీ సాధారణ దర్శనం కోసం రోజుకు వేలాది మంది ఒక్కోసారి లక్ష వరకు కూడ భక్తులు వస్తుంటారు కాబట్టి ఆ పద్దతిని అంత మందికి అమలుచేసే వ్యవస్థ లేకుండా పోయింది. కానీ వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వెళ్ళే అన్యమతస్థులకు మాత్రం ఆ ధృవపత్రం నిబంధనను అమలుచేసేవారు.
2006లో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కానివారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫారమ్‌లో సంతకం చేయడం తప్పనిసరి చేశారు. కానీ పలుసార్లు ఈ చట్టాన్ని కొందరు పాటించపోవడం వివాదాలకు తావిస్తూనే ఉంది. అప్పట్లో రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాంగారు దర్శనానికి వెళ్లినప్పుడు దేవాలయ చట్టాలను గౌరవించి తనకు తానుగా ధృవ పత్రం మీద సంతకం చేసే వెళ్లారు. కానీ కొందరు ప్రముఖులు మాత్రం సిబ్బందితో వాదనకు దిగేవారు. డిక్లరేషన్ మీద సంతకం చేయకుండానే వేళ్ళేవారు. వారిలో వైఎస్ జగన్ కూడ ఉన్నారు.
2012, 2014, 2017 అలాగే 2019లో సీఎం హోదాలో ఆలయానికి వెళ్ళిన ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండానే లోపలికి వెళ్ళినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సాధారణ భక్తుల పేరు చెప్పి అసలు డిక్లరేషన్ లేకుండా చేస్తామని అన్నట్టు వార్తలు రావడంతో వివాదం రేగింది. కేవలం అన్యమతస్తుడైన సీఎం జగన్ కోసమే డిక్లరేషన్ తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే ఉద్దేశ్యం ఏదైనా కానీ ఎన్నో ఏళ్లుగా ఉన్న డిక్లరేషన్ ఆచారాన్ని తొలగించే ప్రయత్నం చేయడం మంచిది కాదని, ఇది అనవసర గొడవలకు తావివ్వడమేనని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.