కన్నతండ్రి కర్తశత్వం… ఉద్యోగం కోసం కన్న కూతురిని చంపిన తండ్రి!

నవ మాసాలు మోసి కన్న బిడ్డలను తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. పిల్లల కోసం వారి జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు మాత్రం వారి స్వార్థం కోసం పిల్లలను బలి చేస్తూ ఉంటారు. ఇటీవల ఉద్యోగం కోసం ఐదు నెలల పసికందును కన్న తల్లిదండ్రులే స్వయంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దారుణ సంఘటన ఆదివారం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన వ్యక్తి ముగ్గురు పిల్లలు ఉంటే ఉద్యోగం ఊడిపోతుంది అన్న భయంతో మూడవ బిడ్డను కనికరం కూడా లేకుండా కాలువలో విసిరేసిన ఘటన చర్చాంషనీయంగా మారింది.

వివరాలలోకి వెళితే…బికనీర్ కు చెందిన జవార్ లాల్ మేఘ్వాల్ అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగస్తుడు. కొంతకాలం గడిచిన తర్వాత ఉద్యోగం రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇటీవల మేఘ్వాల్ భార్య మూడో బిడ్డ (ఆడపిల్ల) కు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ పాప వయసు ఐదు నెలలు. అయితే, ముగ్గురు పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారని మేఘ్వాల్ కు ఇటీవల తెలియడంతో ఉద్యోగం పోతుందని అతనిలో భయం మొదలైంది. ప్రభుత్వ నియమాల ప్రకారం మూడవ బిడ్డ ఉంటే తన ఉద్యోగం ఊడిపోతుందని భయపడిన సదరు వ్యక్తి భార్యతో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు.

తన ఉద్యోగం ఊడిపోకుండా కాపాడుకోవడం కోసం కన్న బిడ్డ ప్రాణాలు పణంగా పెట్టాడు. భార్యతో కలిసి చర్చించిన తర్వాత ఆ బిడ్డని అడ్డు తొలగించుకుంటే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని భావించిన వ్యక్తి భార్యతో కలిసి ఆదివారం ఛత్తార్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కెనాల్ లో బిడ్డను పారేసి వచ్చారు. స్థానికుల సమాచారంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పసికందు మరణానికి కారణమైన ఆ తల్లితండ్రుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో నిందితులు తమ తప్పు అంగీకరించటంతో వారి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.