కోనసీమలో జిల్లా పేరు మార్పు వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన విషయం విదితమే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అప్పట్లోనే మీడియా ముందుకొచ్చి సవివరంగా మాట్లాడి వుండాల్సింది. కానీ, చిత్రంగా ఆయన కాస్త తీరిగ్గా, ఓ సంక్షేమ పథకాన్ని అమలు చేసే క్రమంలో బహిరంగ వేదికపై మాట్లాడారు. అది కూడా, విపక్షాల మీద విమర్శలు చేయడానికి ఆ వేదికను కేసీయార్ ఉపయోగించుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, రాష్ట్ర ప్రజలకు కోనసీమ జిల్లా వివాదంపై వాస్తవాల్ని తెలియజేయాల్సి వుంది. అలర్లకు సంబంధించి ఏ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది వున్నారు.? ఈ ఘటనకు కారణమేంటి.? వంటి విషయాలపై డీజీపీ, హోంమంత్రి, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేసి వుంటే, అది సమంజసంగా వుండేది.
కానీ, బహిరంగ వేదికపైనుంచి, ‘అంబేద్కర్ పేరుని జిల్లాకి పెట్టడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోయాయి. అందుకే ఈ దారుణం జరిగింది. మంత్రి ఇంటినీ, ఎమ్మెల్యే ఇంటినీ తగలబెట్టారు.. సామాజిక న్యాయం అంటే ఇదేనా.?’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. కానీ, ఇక్కడ మంత్రి ఇల్లు తగలబడటం అనేది ప్రభుత్వ వైఫల్యం. మంత్రి అలాగే ఇంకో ఎమ్మెల్యే ఇల్లు కూడా తగలబడిందంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా వున్నాయో అర్థమవుతుందన్న సంకేతం ఆయనే స్వయంగా జనంలోకి పంపినట్లయ్యింది.
పైగా, ప్రతి విషయానికీ విపక్షాలకు లింకు పెట్టడం ద్వారా వైఎస్ జగన్ కేవలం రాజకీయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శ తెరపైకొస్తోంది. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ, ఓ దళితుడ్ని చంపేసి, ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘటన, ఆ వెంటనే కోనసీమ అల్లర్లు.. వెరసి, ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్న వాదన వినిపిస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ విమర్శలకు పరిమితమైతే ఎలా.?