ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి ఇంతలా దిగజారాలా.? మీడియా అటెన్షన్ కోసం నోటికొచ్చినట్లు మాట్లాడాలా.? మంత్రి హోదాలో వుండి, బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. ఎలాగోలా మాట్లాడేసి టైమ్ పాస్ చేయాలనుకోవడాన్ని ఏమనుకోవాలి.? మంత్రి అంబటి రాంబాబుకి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కానీ, కోనసీమ అల్లర్ల వెనుక పవన్ కళ్యాణ్ వున్నారని మాత్రం తెలుసుకున్నారట. ఇదెక్కడి వింత.?
మంచిదే.! కోనసీమ అల్లర్ల వెనుక పవన్ కళ్యాణ్ వున్నారని మంత్రి అంబటి రాంబాబు అనుకుంటే, ఆయన దగ్గర ఖచ్చితమైన సమాచారం వుంటే, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే, పోలీసుల్ని ఆదేశించి.. పవన్ కళ్యాణ్‌ని వెంటనే అరెస్టు చేయించేయొచ్చు.
సాధారణ రాజకీయ నాయకులు మీడియా ముందు ఎలాగోలా మాట్లాడితే అదో లెక్క. కానీ, మంత్రి హోదాలో వుండి రాజకీయ ఆరోపణలు చేయడమేంటి.? పైగా, ‘నేను అనుకోవడం కాదు, ప్రజలంతా అనుకుంటున్నారు..’ అంటూ అంబటి రాంబాబు కోనసీమ అల్లర్ల విషయమై పవన్ కళ్యాణ్ పేరుని తెరపైకి తీసుకొచ్చారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడే, అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకి ఎందుకు పెట్టలేదు.? అన్నది జనసేనాని ప్రశ్న. ఇందులో తప్పేముంది.? ఎన్టీయార్ పేరుని పెట్టినప్పుడు, అంబేద్కర్ పేరు పెట్టడానికి ఎందుకు కాలయాపన వైఎస్ జగన్ సర్కారు చేసిందో ఏమో.!
మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడిని పవన్ కళ్యాణ్ ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడిని కూడా పవన్ కళ్యాణ్ ఖండించారు. కోనసీమ అల్లర్లను మొత్తంగా పవన్ కళ్యాణ్ ఖండించారు. అవి అంబటికి మాత్రం కనిపించలేదు. ‘పవన్ కళ్యాణ్ ఎందుకు కోనసీమ అల్లర్లను ఖండించలేదు.?’ అన్నది అంబటి అమాయకత్వపు ప్రశ్న.